ఇక 'బిటి' వంకాయ కూర! న్యూఢిల్లీ : 'గుత్తి వంకాయ కూర మావోయ్... కూరి కూరి తెచ్చానోయ్ మామా' అంటూ భామలు ఇక ఊరించే అవకాశం లేదు! ఇకపై 'బీటీ వంకాయ కూర' వండి తెచ్చానోయ్ అనాల్సిందే! ఎందుకంటే.... పలువురు పర్యావరణ వేత్తల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ భారత్ లో బీటీ వంకాయ సాగుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జీవ సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ మండలి (జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ - జీఈఏసీ) దేశంలో జన్యుమార్పిడి వంకాయల పర్యావరణ ప్రయోగాత్మక ఉత్పత్తికి సమ్మతించింది. దీన్నే 'ఎన్విరాన్ మెంటల్ రిలీజ్' అంటారు. అంటే... ప్రయోగాత్మకంగా సాగు చేయడం అని అర్థం. అయితే... ఈ పరీక్షలు ఎప్పుడో పూర్తయ్యాయి. బీటీ వంకాయ సాగుకు అనుమతి ప్రపంచంలో మొదటిసారిగా భారత్ లోనే లభించింది. ఇక మిగిలింది తుదిగా అనుమతి ఇవ్వడమే!
ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగానే సాగుకు అనుమతించామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జై రామ్ రమేష్ తెలిపారు. అందరితో చర్చించన తరువాతనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యవసాయ జీవ సాంకేతిక శాస్త్రవేత్తలు హర్షించారు. దీనివల్ల క్రిమి సంహారక మందుల వినియోగం తగ్గుతుందని వారు పేర్కొన్నారు. దేశంలో పలు చోట్ల క్షేత్ర స్థాయిలో ప్రయోగాలను మహికో కంపెనీ, తమిళనాడు, కర్నాటకలోని విశ్వవిద్యాలయాలు కలసి నిర్వహించాయి. కాగా బుధవారం బీటీ వంకాయ సాగుకు నిర్ణయం తీసుకునే ముందు జీఈఏసీ లో ముగ్గురు శాస్త్రవేత్తలు దేశంలో బీటీ సాగును వ్యతిరేకించారని తెలిపింది.
'బీటీ సాగు చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది' అని హైదరాబాద్ లోని సెల్యులర్ అండ్ మాలెక్యూలర్ బయోలజీ సెంటర్ మాజీ డైరెక్టర్ పుష్ప భార్గవ అభిప్రాయపడ్డారు. వైవిద్యంగా తినడానికి వినియోగదారునికి గల హక్కును బీటీ వంకాయ హరిస్తోందని ప్రభుత్వ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ సభ్యుడు బీజోన్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ దేశంలోని కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో 5 లక్షల హెక్టార్లలో వంకాయ సాగు చేస్తారు. కాయ తొలుచు పురుగుల కారణంగా సగం పంట చేతికి రావడంలేదని తెలుస్తోంది.
News Posted: 15 October, 2009
|