విస్కీ వద్దు, క్యాలెండర్ ఓకె! న్యూఢిల్లీ : దీపావళి సీజన్ మరొక తరహా బాణసంచాకు దారి తీస్తున్నట్లు కనిపిస్తున్నది. విజయ్ మాల్యా తనకు కానుకగా పంపిన బ్లాక్ డాగ్ విస్కీ సీసాను భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రభాత్ ఝా వాపసు చేస్తూ పరుష పదజాలంతో కూడిన ఒక లేఖ పంపారు. ఝా చర్య ఇతర ఎంపిలను ఇరకాట స్థితిలోకి నెట్టింది. లేకపోతే వారు మాల్యా మద్యం కానుకతో 'హాయిగా ఎంజాయ్' చేసి ఉండేవారు.
ఝా చేసిన పనికి నిరసనలు ఎంతగా వ్యక్తమవుతున్నాయంటే పలువురు ఎంపిలు క్రితం సంవత్సరం దీపావళి కానుకగా అనేక మంది ఎంపిలకు మాల్యా పంపిన కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను కూడా ఝా తిప్పి పంపి ఉండవలసిందని వ్యాఖ్యానించారు. 'మద్యానికి మాత్రమే అభ్యంతరం తెలియజేయడం వింతగా ఉంది' అని బిజెపి సీనియర్ ఎంపి ఒకరు అన్నారు. అయితే, తనకు ఆ క్యాలెండర్ అందనే లేదని ఝా స్పష్టం చేస్తున్నారు. 'ఇతరులకు అది అంది ఉండవచ్చు. నేను సముచితంగా లేదని భావించినందునే మద్యాన్ని వాపసు చేశాను' అని ఆయన పేర్కొన్నారు.
సుప్రసిద్ధ ఇటాలియన్ పైరెల్లి క్యాలెండర్ తరహాలోనే ఆ క్యాలెండర్ కూడా అమ్మకానికి కాదు. సంవత్సరంలోని ప్రతి నెల పేపర్ పై బికినీ ధరించిన మోడల్స్ చిత్రాలు ఉంటాయి. వాస్తవానికి ఆ క్యాలెండర్ ను చివరకు వామపక్ష ఎంపిలు కొందరు కూడా ఇష్టపడుతున్నారు. 'నేను క్యాలెండర్ ను తెరచి ఇక్కడ వేలాడదీయలేను. కాని నేను దానిని అట్టిపెట్టుకున్నాను' అని సీనియర్ లెఫ్ట్ ఎంపి ఒకరు ముసిముసి నవ్వులతో చెప్పారు. కాగా, బిజెపి అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ను విస్కీ సీసాను లేదా క్యాలెండర్ ను తిప్పి పంపారా అని మీడియా ప్రశ్నించినప్పుడు తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు. 'నేను గడచిన నాలుగు రోజులుగా నగరంలో లేను. నాకు అవి అందాయా లేదా అనేది నాకు నిజంగా తెలియదు' అని ప్రసాద్ చెప్పారు.
అయితే, దీపావళి కానుకపై రేగుతున్న ఈ వివాదంతో ఇంత కాలం ఢిల్లీలో గుట్టుగా సాగుతున్న ఒక వ్యవహారం అందరి దృష్టికీ వచ్చింది. రాజకీయ రంగంలోని వారికి కేవలం రాజకీయ సహచరుల దగ్గర నుంచే కాకుండా కార్పొరేట్ పెద్దల నుంచి కూడా ఖరీదైన కానుకలు అందుతుంటాయనే రహస్యం ఇప్పుడు బట్టబయలైంది. బంగారు నాణాలు, వెండి డిన్నర్ సెట్లు, టీ సెట్లు, మద్యం సీసాలు ఈ సంవత్సరం కానుకలుగా అందబోతున్నాయని తెలుస్తున్నది. 'గతంలో మేము ఎంపిలకు సూట్లు పంపుతుండేవారం. కాని గత ఐదు సంవత్సరాలుగా వెండి, బంగారం వస్తువులు పంపుతున్నాం' అని కార్పొరేట్ ప్రముఖుడు ఒకరు తెలియజేశారు.
News Posted: 15 October, 2009
|