ఐడీకి పదివేళ్ళ ముద్రలు! న్యూఢిల్లీ : ప్రత్యేక గుర్తింపు కార్డుల ప్రాజెక్టు కోసం చేతివేళ్ళ ముద్రల సేకరణను కేంద్రం ప్రారంభించనుంది. నేషనల్ బయోమెట్రిక్ డాటా బేస్ కు ఒక బొటనవేలి ముద్ర కాకుండా... రెండు చేతులకు చెందిన పదివేళ్ళ ముద్రను తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పత్రాలు అవసరమైన చోట స్కానర్లు నెలకొల్పడం ద్వారా వేలిముద్రను సేకరించే అవకాశం ఉంది. రేషన్ కార్డ్, డ్రైవిగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డ్ తదితర కార్యాలయాల్లో అవసరమైన చోట స్కానర్లను నెలకొల్పే వీలుంది. పాస్ పోర్ట్ కేంద్రాల వద్ద బొటనవేలి ముద్రలు సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఆస్తుల డాక్యుమెంట్ల దగ్గర మాత్రమే పదివేళ్ళ ముద్రలు తీసుకుంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర పథకాల ద్వారా 64 లక్షల కుటుంబాల వేలి ముద్రలను సేకరించినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక గుర్తింపు కార్డుల జాతీయ ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ యు ఐ) అధికారి ఒకరు మాట్లాడుతూ బ్యాంకుల్లో వేలిముద్రలను సేకరించడం వల్ల ఫోర్జరీలకు అవకాశం ఉండదన్నారు. వేరు వేరు గుర్తింపు కార్డులతో అనేక ఖాతాలు నిర్వహించేవారిని గుర్తించవచ్చునని తెలిపారు. 'మాతో భాగస్వాములైన విభాగాలు ఉన్నాయి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటికి రెండు నెంబర్లు ఉంటాయి. ఒకటి ఆయా కార్డుల సొంత నెంబరు. రెండోది ప్రత్యేక గుర్తింపు కార్డు నెబంరూ. చివరకు యూఐడీ నెంబర్ మాత్రమే ఉంటుందని' జాతీయ ప్రాధికార సంస్థ ఛైర్మన్ నీలేకని తెలిపారు.
News Posted: 15 October, 2009
|