పనితీరుకు ప్రమాణాలేమిటి? న్యూఢిల్లీ : వేతనాల పెంపును పనితీరుతో ముడి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకులు ఉద్యమించారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యు) అధ్యాపకులు, ఫ్రొఫెసర్లు ధర్నా చేశారు. వీరికి మద్దతుగా దేశంలోని వివిధ సెంట్రల్ విశ్వ విద్యాలయాల్లోని అధ్యాపక సిబ్బంది సమ్మె చేస్తున్నారు. పనితీరుకు పాయింట్లు ఇచ్చి వాటి ఆధారంగా వేతనాలు పెంచుతామని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చెప్పడాన్ని అధ్యపకులంతా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎన్ ఆదిత్య మాట్లాడుతూ అధ్యాపకుల పనితీరును ఏఏ ప్రమాణాలతో ఎలా కొలుస్తారని ప్రశ్నించారు. మరోవైపు అధ్యాపకుల్లో జవాబుదారీ తనాన్ని పెంచాల్సి ఉందని జేఎన్ యూ మాజీ వైస్ ఛాస్సలర్ జి ఎన్ చద్దా అభిప్రాయపడ్డారు. కళాశాల, విశ్వవిద్యాలయాల అధ్యాపకుల వేతనాలను సవరించాలని సూచించిన రివ్యూ కమిటీకీ నాయకత్వం వహించారు. 'వారిని (అధ్యాపకులను) నోబెల్ బహుమతులు సాధించాలని కోరడం లేదు. అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు కొంత సమయం పరిశోధనలకు కేటాయించాలని కోరుతున్నాం' అని చద్దా గుర్తు చేశారు. 'మీరేం బోధిస్తున్నారు... మీ జ్ఞానాన్ని వర్తమానానికి తగ్గట్టుగా ఎలా పెంచుకుంటున్నారు. ఇదంతా కూడా విద్యాబోధన చట్టం పరిధిలోకి రావాలి' అని ఆయన అభిప్రాయపడ్డారు.
News Posted: 15 October, 2009
|