టిడిపికి రోశయ్యే ముద్దు హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కన్నా కొణిజేటి రోశయ్యే కొనసాగాలని తెలుగుదేశం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రోశయ్య అధికారంలో ఉన్న పక్షంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పోరాటం కొంతమేరకు సులభంగా ఉంటుందని తెలుగుదేశం అంచనా. కాంగ్రెస్ పట్ల మెతక వైఖరిని తెలుగుదేశం అనుసరించడం ఆ పార్టీ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఎన్నికైనప్పుడు నంద్యాల లోక్ సభ స్థానం నుంచి ఆయన ఎన్నికైయ్యేందుకు వీలుగా తెలుగుదేశం తరఫున అభ్యర్థిని నిలబెట్టలేదు. తెలుగువాడు ప్రధాని అయినందుకు గర్వించాలని ప్రకటించింది. పీవీ మరణానంతరం ఆయనకు ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మించాలని డిమాండ్ చేసింది. చాలా కాలం తరువాత మరోసారి కాంగ్రెస్ పట్ల తెలుగుదేశం మెతక వైఖరి ప్రదర్శన రాజకీయ విశ్లేషకులను ఆకట్టుకుంటోంది. ఎందుకంటే తెలుగుదేశం ఆవిర్భవం, సిద్ధాంతం... ప్రధానంగా కాంగ్రెస్ వ్యతిరేకతపైనే ఆధారపడి ఉంటుంది.
వైఎస్ ఆకస్మిక మృతి అనంతరం కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సుతో ముఖ్యమంత్రి అయిన కె.రోశయ్య పట్ల తెలుగుదేశం మృదువుగానే వ్యవహరిస్తోంది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు గానీ ఇతర నేతలుగానీ రోశయ్యకు వ్యతిరేక వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. వరదల సమయంలో ముఖ్యమంత్రికి అనేక సార్లు చంద్రబాబు ఫోన్ చేసి ఆయా ప్రాంతాల్లో వరదలు - బాధితుల పరిస్థితిని వివరించారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి సహచర మంత్రులంతా జగన్ ను సీఎం చేయడంలో మునిగితేలారని మాత్రమే తెలుగుదేశం విమర్శిస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచ్చిన పక్షంలో క్షేత్రస్థాయిలో రాజకీయ పోరాటం తీవ్రంగానే ఉంటుందని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరదల సమయంలో ప్రభుత్వం వైఫల్యం పై చంద్రబాబు మాట్లాడుతూ, 'ఎవరు చేశారు, చేయలేదన్నది కాకుండా... వరద బాధితులకు తక్షణ సహాయం అందాలని' అన్నారు.
తెలుగుదేశం మరోవైపు బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రోజుకు 10 లారీల్లో వస్తు సామాగ్రిని వరద బాధిత జిల్లాలకు పంపిస్తోంది. ఇంతేకాకుండా సీనియర్ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా కమిటీని వేసింది. అధికారంలో ఉన్నా, లేకపోయినా మీతోనే ఉన్నామని చాటడం ద్వారా ప్రజల్లో ఆదరణ పెంచుకోవాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది.
News Posted: 16 October, 2009
|