59 కోట్లు తీసుకోని వడ్రంగి అహ్మదాబాద్ : జుగల్ కిషోర్ జాన్గిడ్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అతని సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ రూ. 2.5 లక్షలని కాకుండా రూ. 59.30 కోట్లని సూచించింది. వడ్రంగి అయిన జాన్గిడ్ తెల్లవారు జామునే ఎటిఎంలో కనిపించిన ఈ వింతను విశ్వసించేందుకు సిద్ధంగా లేడు. తానేమీ కల కనడం లేదని నిర్థారించుకోవడానికై జాన్గిడ్ఉదయం 6 గంటలకు మరొక ఎటిఎంలో తన అకౌంట్ ను సరిచూసుకున్నాడు. అప్పటికీ అతను దానిని నమ్మలేకపోయాడు. అందువల్ల రెండు గంటల తరువాత వేరొక ఎటిఎం వద్దకు వెళ్ళాడు. అయినా కూడా అదే మొత్తం కనిపించింది.
జాన్గిడ్ నెలకు రూ. 7000 ఆర్జిస్తుంటాడు. అయితే, అతను ఆ డబ్బును విత్ డ్రా చేయలేదు. అలా తీసుకోకుండా బ్యాంకుకు ఈ విషయం తెలియజేయాలని అతను నిర్ణయించుకున్నాడు. ముందుగా జాన్గిడ్ తన మిత్రుడు అంజూ షెఖత్ తో ఈ సంగతి చెప్పాడు. షెఖత్ తన చార్టర్డ్ అకౌంటెంట్ పి. ఖండేల్వాల్ కు సంగతి వివరించాడు. గుజరాత్ వాణిజ్య, పారిశ్రామిక మండలి (జిసిసిఐ) మాజీ కోశాధికారి దుర్గేష్ బుచ్ సాయం తీసుకోవాలని ఖండేల్వాల్ నిర్ణయించుకున్నారు. జాన్గిడ్ తరఫున జిసిసిఐ ఈ విషయాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్ బి) గుజరాత్ సర్కిల్ ఆఫీస్ దృష్టికి తీసుకుపోయింది.
'ఈ కేసును క్షుణ్ణంగా పరిశోధించగా జాన్గిడ్ అకౌంట్ లో సూచించిన మొత్తం అసలైనది కాదు. బ్యాలెన్స్ లో మార్పేమీ లేదు' అని పిఎన్ బి డిప్యూటీ జనరల్ మేనేజర్ (డిజిఎం) ఎ.కె. రాయ్ చౌదరి వివరించారు. చౌదరి సమాచారం ప్రకారం, ఆయన బ్రాంచ్ ఢిల్లీలోని హెడ్ ఆఫీసుకు ఈ సంగతి నివేదించింది. ఎటిఎం సర్వర్ ఉదయం నుంచి పనిచేయడం లేదని బ్రాంచ్ కు తెలియవచ్చింది. 'ఈ పొరపాటు కారణంగా జాన్గిడ్ ఖాతాలో ఈ మొత్తం కనిపించి ఉండాలి. దీనిని వెంటనే సరిదిద్దాం' అని ఆయన తెలిపారు. 'కల వంటి' ఈ మొత్తం ఖాతాలో చూపినప్పటికీ నిజాయితీతో వ్యవహరించినందుకు జాన్గిడ్ ను గుజరాత్ వాణిజ్య, పారిశ్రామిక మండలి, పిఎన్ బి సన్మానించనున్నాయి.
News Posted: 16 October, 2009
|