మోడల్ స్కూళ్ళకు గ్రహణం! న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి బ్లాక్ లో ఒక మోడల్ స్కూల్ ను నెలకొల్పాలన్న ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ రెండేళ్ళు గడిచినా ఒక్కడుగూ ముందుకు పడలేదు. ఇంకా కేంద్ర రాష్ట్రాల అధికారులు స్కూల్ కు నిర్వచనం ఇవ్వడం, యంత్రాంగాల రూపకల్పనలోనే కుస్తీ పడుతున్నారు. మరోవైపు అంచనా వ్యయం రెట్టింపు కావడంతో స్కూళ్ళ సంఖ్యను తగ్గించడమో లేదా వాటికి కల్పించే సౌకర్యాలకు కోత పెట్టడమో చేయాల్సిన పరిస్థులు కనిపిస్తున్నాయి. దేశంలో ఆరువేల మోడల్ స్కూళ్ళను నెలకొల్పుతామని 2007 ఆగస్టు 15 నాటి స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. కేంద్రీయ విద్యాలయం తరహాలో నెలకొల్పే ఈ పాఠశాలలు ఇతర స్కూళ్ళకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు. అయితే అమలులో జాప్యం కారణంగా 2007 లో 3.2 కోట్ల రూపాయలుగా ఉన్న అంచనా మొత్తం 6.8 కోట్లకు చేరింది. ఆర్థిక మాంద్యంతో నిధుల కొరతను ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి అంచనా వ్యయం పెరుగుదల ప్రభుత్వానికి సవాలుగా ప్లానింగ్ కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే అంచనా పెంపు, నిధుల కొరత ఏవీ కూడా ప్రాజెక్టుకు ఆటంకం కాజాలవని మానవవనరుల అభివృద్ధి శాఖ అధికారులు కొందరు తెలుపుతున్నారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాఠశాలను నెలకొల్పడం 3.2 కోట్ల రూపాయలతో కూడా సాధ్య మవుతుందని అంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు మొదటి విడత నిధులను ఈనెల మొదట్లో విడుదల చేసినట్లు చెప్పారు. అదే సమయంలో వ్యయం పెరుగుదల వల్ల పాఠశాలలో నెలకొల్పే సౌకర్యాలను తగ్గించే అవకాశాన్ని ప్రభుత్వాధికారులు తోసిపుచ్చలేదు. దేశంలో మొత్తం ఏడువేలకు పైగా బ్లాక్ లు ఉండగా ఆరువేల పాఠశాలలను ప్రభుత్వం నెలకొల్పనుంది. వీటిలో 2500 స్కూళ్ళను ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో నెలకొల్పుతారు. మిగిలిన 3500 పాఠశాలలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నెలకొల్పుతారు. ఇంకా ఈ మోడల్ స్కూళ్ళ ఏర్పాటుకు అవసరమైన బ్లూ ప్రింట్ ను ఇంకా సిద్ధం చేయలేదు.
News Posted: 19 October, 2009
|