మర్డర్ చేసిన టెకీలు! హైదరాబాద్: వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ అయిన యువకులు కొందరు స్త్రీ, డబ్బు వ్యామోహంలో పడి హార్డ్ కోర్ క్రిమినల్స్ ను తలపించే రీతిలో ఒక వృద్ధుడిని కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ఇది. జీడిమెట్ల ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీ స్థాపించి అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగిన 63 ఏళ్ళ బారోజు జీవరత్నా చారి హత్య కేసులో అనేక ఆసక్తికరమైన కోణాలను పోలీసు విచారణలో వెల్లడయ్యాయి. ఈ హత్యకు పాల్పడిన ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు నిలబెట్టారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చారికి జీడిమెట్ల ప్రాంతంలోని గాజుల రామారం చౌరస్తాలోగల ఉషోదయ కాంప్లెక్స్ లో సొంత ఇల్లు ఉంది. దానికి సమీపంలోనే చారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన కార్యాలయం ఉంది. చారికి ముగ్గురు కుమార్తెలు. వారందరికీ వివాహాలు జరగడంతో వారు వేర్వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. దీంతో చారి తన భార్య కరుణతోపాటు ఉషోదయ కాంప్లెక్స్ లో ఉంటున్నారు. విశాఖపట్నం నుంచి నగరానికి వలస వచ్చిన ధనలక్ష్మి కొద్ది కాలం క్రితం చారి కార్యాలయంలో అకౌంటెంట్ గా చేరింది. అతి తక్కువ కాలంలో ఆమె చారికి చేరువైంది. ఒంటరిగా ఉంటున్న ఆమె కోసం చారి తన సొంత ఇంట్లోనే ఒక గదిని కేటాయించారు. చారి భార్య విశాఖపట్నంలో ఉంటున్న చిన్న కూతురు వద్దకు వెళ్ళిపోవడంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల కాలంలో చారి మరొక యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ధనలక్ష్మికి తెలిసింది.
ధనలక్ష్మికి చారితోపోటు ఆ పరిసర ప్రాంతంలోనే నివసిస్తున్న వాసుబాబు, సుభాష్ బాబులతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అయితే చారి మరొక యువతితో సన్నిహితంగా ఉండటాన్ని భరించలేని ధనలక్ష్మి ఆయనను అంతం చేసి సొమ్మును దోచుకోవడానికి పథకం వేసింది. ఈ పథకం ప్రకారమే ఈ నెల 9న చారి ఆయన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ధనలక్ష్మి, ఆమెకు సహాయపడిన వారిని అరెస్ట్ చేశారు. వారిలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాసు, డెల్ కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజనీర్ కిరణ్, పుడ్ బిజినెస్ లో ఉన్న సుభాష్, ఐలాబ్స్ ఉద్యోగి రవీంద్ర ప్రవీణ్ ఉన్నారు. వీరంతా కూడా జీడిమెట్ల, ఎస్ ఆర్ నగర్ కు చెందినవారే.
చారి తనను నిర్లక్ష్యం చేయడంతోపాటు నిలదీసినందుకు రూమ్ నుంచి వెళ్ళగొట్టడంతో రగిలిపోయిన ధనలక్ష్మి తన స్నేహితులు వాసు, సుభాష్ లను రెచ్చగొట్టింది. ఒంటరిగా ఉంటున్న చారి దగ్గర చాలా ధనం ఉందని, చారిని లేపేస్తే ఆ ధనంతో ఉడాయించవచ్చునని వారిని నమ్మించింది. ఈ విధంగా చారిని హత్య చేసేందుకు తన మిత్రులను ప్రేరేపించింది. వారు ముగ్గురూ కలసి మరో ఇద్దరు స్నేహితులను కూడగట్టుకొని ఈ నెల 9న చారి ఇంట్లోనే అతన్ని హత్యచేశారు. అయితే హత్య చేసిన అనంతరం నిందితులు ఇల్లంతా గాలించినా వారికి డబ్బుకాని, విలువైన వస్తువులు గాని దొరకలేదు. ఒక బంగారు ఉంగరం, రెండు వెండి గొలుసులు, చారి జేబులోని రెండు వేల రూపాయలను చేజిక్కించుకుని పరారయ్యారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు చారి మొబైల్ ఫోన్ లో ధనలక్ష్మి ఫోన్ కు వెళ్ళిన కాల్స్ వివరాలను ఆరాతీయడంతో ధనలక్ష్మి మొత్తం కథంతా పోలీసుల ముందు కక్కేసింది.
News Posted: 20 October, 2009
|