అద్దె కోసం వీఐపీల కక్కుర్తి! హైదరాబాద్ : 'పలికేటందుకే పెదవులు ఉన్నాయి. చెప్పేటందుకే నీతులు ఉన్నాయి' అని ఏనాడో సినీ కవి ఘోషించాడు! ప్రకృతి విలయాల్లో, ఇతరత్రా సంఘటనల సమయంలోనూ, ఆర్థిక మాంద్యం నేపథ్యంలోనూ 'త్యాగాలకు సిద్ధం కావాలి' అని ప్రజలకు పిలుపునిచ్చే నేతలు మాత్రం 'త్యాగాలు' చేయడానికి సిద్ధ పడరు! తమ ద్వారా ప్రభుత్వానికి అయ్యే వ్యయాన్ని తగ్గించుకోరు! రాష్ట్రంలోని ప్రముఖుల్లో అనేకమంది - తాము నివాసం ఉండేందుకు ప్రభుత్వం ఇస్తున్న 'అద్దె' మొత్తాన్ని కాదనకుండా స్వీకరిస్తున్నారు. ఇలా స్వీకరించే వారిలో పలువురు మంత్రులతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్న 30 వేల రూపాయలను తీసుకోవడానికి నిరాకరించింది - శాసనసభ ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఒక్కరే! జూబ్లీ హిల్స్ లోని సొంత నివాసంలో ఉంటున్న ఆయన - అద్దె తీసుకోవడానికి అర్హత ఉన్నా - తీసుకునేందుకు నిరాకరించారు. ప్రభుత్వ వసతి గృహాలు, బంజారాహిల్స్ లోని క్వార్టర్లల్లో మంత్రులు నివసించే అవకాశం ఉన్నా అక్కడ వారు నివసించడం లేదు. ముఖ్యమంత్రి రోశయ్యతో సహా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు తమ సొంత ఇళ్ళల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ముఖ్యమంత్రి రోశయ్య అదే రోడ్ లోని తన ఇంట్లోనే ఉండేందుకు సుముఖత చూపుతున్నారు. అంతకు ముందు సిఎం క్యాంప్ ఆఫీస్ ను వైఎస్ హయాంలోనే వైభోవపేతంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ భవనం ప్రస్తుతం వైఎస్ కుటుంబం ఆధీనంలో ఉంది. తన ఇంట్లో నివసించడం ద్వారా పూర్వ సంప్రదాయాన్ని పాటించాలని ముఖ్యమంత్రి రోశయ్య భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన జలగం వెంగళరావు ద్వారకావురి కాలనీలో, మర్రి చెన్నా రెడ్డి తార్నాకలోని తమ నివాసాల్లోనే ఉన్నారు. బంజారాహిల్స్ లోని సొంత ఇంటిలో ఉంటున్న స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి నెలకు 30 వేల రూపాయలను ప్రభుత్వం నుంచి తీసుకోవడాన్ని సమర్థించుకున్నారు. తన ఇంటిపై పెద్ద మొత్తంలో రుణం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని స్వీకరించడంలో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వీరే కాకుండా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కూడా సొంత ఇళ్ళల్లోనే నివసిస్తున్నారు.
News Posted: 20 October, 2009
|