హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) తమ అధిపతుల పుణ్యమా అంటూ కళంకాలను మూటకట్టుకుంటోంది. అమెరికన్ స్టాక్ ఎక్సేంజి లో ఇటీవల వెలుగుచూసిన భారీ ఇన్ సైడ్ ట్రేడింగ్ కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ను బాధ్యతల నుంచి తప్పుకోమని ప్రభుత్వం ఆదేశించింది. అనిల్ కుమార్ ను ఐఎస్ బీ బోర్డు నుంచి తప్పు కోవాలని ఆదేశించినట్టు ఐఎస్ బీ డీన్ అజిత్ రగ్నేకర్ చెప్పారు.
హెడ్జ్ ఫండ్ ఫౌండర్ రాజ్ రాజారత్నం ఇతర అమెరికా సంస్థల ఎగ్జిక్యూటివ్ లతో కలిసి అనిల్ కుమార్ ఇన్ సైడ్ ట్రేడింగ్ లో పాల్గొన్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఐఎస్ బీకి చెందిన అధిపతులు స్కాములో చిక్కుకున్నట్లుగా ఆరోపణలు రావడం ఇది రెండోసారి. గత ఏడాది సత్యం వ్యవస్థాపకుడు రామలింగరాజు వేలాది కోట్లరూపాయల కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు అప్పటి ఐఎస్ బి అధిపతి ప్రొఫెసర్ రామోహన్ రావు కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. సత్యం బోర్డు డైరెక్టర్ గా ఉన్న ఆయన కుంభకోణం వెలుగు చూసిన వెంటనే ఐఎస్ బీ డీన్ పదవికి రాజీనామా చేశారు.