కేసీఆర్ 'ఫ్రీజోన్' జోరు హైదరాబాద్ : మొన్నటి తాజా ఎన్నికల్లో చావుదెబ్బతిని, ఆ తరువాత పరిణామాల్లో ముక్కచెక్కలై అంతర్గత కుమ్ములాటలతో కునారిల్లిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయాచితంగా కొత్త ఆయుధం అందింది. ఎడాపెడా తగిలిన దెబ్బలతో మౌనవ్రతానికి పరిమితమైన ఆ పార్టీ అధినేత కే.చంద్రశేఖరరావు గొంతెత్తి కొత్త పాట అందుకోవడానికి అవకాశం లభించింది. అదే హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారం. ఎడారిలో ఒయాసిస్సులా, వరదలో చెట్టు కొమ్మలా, కరువులో పరమాన్నంలా 'ఫ్రీజోన్' తెరాసకు దొరికింది. హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా పరిగణించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తెరాసకు జవజీవాలు పోసినట్టు అయింది. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మేధావి వర్గాలు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు దానికి అండదండగా నిలిచాయి. అయితే టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఒంటెద్దు పోకడలతో ఈ సంఘాలన్నీ పార్టీకి దూరం కావడంతో టిఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఫ్రీజోన్ పై ఇచ్చిన ఉత్తర్వులను అస్త్రంగా మలచుకుని మళ్ళీ టీఆర్ఎస్ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో పార్టీకి దూరం అయిన వర్గాలన్నీ తాజాగా మళ్ళీ చేరువయ్యేలా చేశాయి.
సుప్రీం కోర్టు ఉత్తర్వులను రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయించాలన్న ప్రధాన డిమాండ్ తో టిఆర్ఎస్ దశల వారీగా ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సిద్ధిపేటలో బుధవారం టిఆర్ఎస్ జరుపతలపెట్టిన ఉద్యోగ గర్జనకు తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మేధావి వర్గాలు తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించాయి. దీంతో ఈ సభను టిఆర్ఎస్ పరంగా కాకుండా తెలంగాణ ఉద్యోగుల ఆధ్వర్యంలోనే నిర్వహించే విధంగా టిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయాలకు అతీతంగా సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన నిర్వహిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఫ్రీజోన్ వల్ల తెలంగాణ ఉద్యోగులకు జరగబోయే నష్టం పట్ల టిఆర్ఎస్ పార్టీ ముందుగా స్పందించడంతో, అంశాల వారీగా ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్, టిఎన్ జిఓ సంఘం అధ్యక్షుడు స్వామిగౌడ్ ప్రకటించారు.
తమ సంయుక్త కార్యాచరణలో భాగస్వామ్యంగా ఉన్న 15 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట సభ జరుగనుందని ఆయన తెలిపారు. అలాగే ఈ సభకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మేధావి వర్గాలు, కవులు, కళాకారులు, న్యాయవాదులు తమ సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు వారంతా పాల్గొనబోతున్నారని స్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శి దేవి ప్రసాద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విఠల్, పద్మానాభాచారి, తెలంగాణ ఉద్యోగ సంఘాల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ దేశ్ పాండే సంయుక్తంగా ప్రకటించారు. ఉద్యోగ గర్జన సభకు తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు స్వామిగౌడ్ అధ్యక్షతన వహిస్తారని వారు తెలిపారు. ఇలా ఉండగా ఈ సభ రాజకీయపరమైంది కాదని, తమ సమస్య పట్ల టిఆర్ఎస్ స్పందించడంతో ఆ పార్టీ చేపట్టిన ఆందోళనకు మద్దతు ప్రకటించామని స్వామిగౌడ్ స్పష్టం చేశారు.
News Posted: 21 October, 2009
|