మన నగరాలూ గొప్పవే! న్యూఢిల్లీ : దుమ్మూదూళితో అపరిశుభ్రత, అడ్డూ ఆపూలేని ఆక్రమణలు, ప్రణాళిక లేని విస్తరణ... మురికివాడలతో కిక్కిరిసిన భారతీయ నగరాలు ప్రపంచ ర్యాంకుల్ని సాధించాయి. చినుకులు కురిస్తే... ఏరులై పారే రహదారులు, ఎక్కడన్నా ప్రమాదం జరిగితే ఎక్కడికక్కడ స్తంభించిపోయే రవాణా... ఇదీ నగరాల తీరు. కానీ ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అన్నట్టుగా ఈ నగరాలకు ప్రపంచదేశాల్లో మంచి గుర్తింపు లభిస్తోంది. ఇందులో కూడా విశేషం ఏమిటంటే... అవుట్ సోర్సింగ్ సేవల కోసం ప్రపంచదేశాలు లక్ష్యాలుగా ఎంచుకున్న ప్రధాన నగరాలు ఎనిమిదిలో ఆరు భారత్ కు చెందినవే. అంటే సింహభాగం మనదేనన్నమాట. మిగిలిన రెండు నగరాలు - ఫిలప్ఫిన్స్ లోని మనీలా, ఐర్లాండ్ లోని డబ్లిన్ ప్రపంచదేశాలను అవుట్ సోర్సింగ్ సేవల కోసం ఆకర్షిస్తున్నాయి.
అలాగే భారత్ లోని బెంగళూరు, ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్, పూణె నగరాలు కూడా అవుట్ సోర్సింగ్ కేంద్రాలయ్యాయి. అవుట్ సోర్సింగ్ లో మొదటి 50 లక్ష్యాలు పేరిట గ్లోబల్ సర్వీసెస్ (సైబర్ మీడియా) థోలన్స్ (సలహాసంస్థ) కలిసి నిర్వహించిన సర్వేలో భారతీయ నగరాలకు అగ్ర తాంబూలం దక్కింది. టాప్ టెన్ లో ఉండాలని భావించే నగరాల్లో చైనా ముందంజలో ఉంది. చైనాలోని షాంఘై, బీజింగ్, షెంజెహెన్, వియత్నాంకు చెందిన హోచిమిన్, హనోయి నగరాలు ఉన్నాయి. క్రాకో (పోలెండ్), బ్రూనోఏరిస్ (అర్జెంటీనా), కైరో (ఈజిప్టు), సావోపౌలో (బ్రెజిల్) కూడా ఈ కోవలోనివే.
థోలన్స్ సీఈవో అవినాష్ వశిష్ఠ మాట్లాడుతూ నిపుణులైన కార్మికులు, తక్కువ వ్యయం కారణంగా అవుట్ సోర్సింగ్ లక్ష్యాలను ప్రపంచదేశాలు ఎంచుకుంటాయని చెప్పారు. మరో వైపు భారత్ 2008లో ఐటీ - అవుట్ సోర్సింగ్ సేవల ఆధారంగా 4 వేల కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందింది. ఈ ఆదాయంలో ఐదేళ్ళుగా ఏటా 35 శాతం వృద్ధి కనిపిస్తోంది.
News Posted: 21 October, 2009
|