జగన్ కు నౌకాయానం? న్యూఢిల్లీ: వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం తొలిసారిగా బుధవారం ఢిల్లీలో అడుగుపెట్టిన ఆయన తనయుడు వైఎస్ జగన్ కు 10 జనపథ్ నుంచి పిలుపు వచ్చేసింది. గురువారం ఉదయం జగన్ తన మార్గదర్శి కేవీపి రామచంద్రరావుతో కలసి సోనియా అధికార నివాసం అయిన 10 జనపధ్ లో అడుగుపెట్టారు. వీరిద్దరితో సోనియా గాంధీ కొద్ది నిమిషాలపాటు ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికానప్పటికీ జగన్ కు కేంద్రంలో పునరావాసం కల్పించేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధం చేసి ఉంచిన ప్యాకేజిని ఈ సమావేశంలో సోనియా గాంధీ స్వయంగా జగన్ కు ఆఫర్ చేస్తారని రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు వెల్లడించారు.
ప్యాకేజిలో భాగంగా జగన్ కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది. ప్రస్తుతం కేంద్ర నౌకాయాన మంత్రిగా వ్యవహరిస్తున్న జికె వాసన్ స్థానంలో జగన్ కు ఆ పదవి కట్టబెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు ఆ నాయకుడు తెలిపారు. స్వరాష్ట్రమైన తమిళనాడుకు తిరిగి వెళ్ళి అక్కడ పార్టీ వ్యవహారాలలో చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నట్లు వాసన్ కొద్ది కాలం క్రితమే పార్టీ అధిష్టానానికి తెలిపినందున ఆయన స్థానాన్ని జగన్ తో భర్తీ చేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి పదవిని స్వీకరించడం ద్వారా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ముందుగా పాలనకు సంబంధించిన పట్టు విడుపులను పూర్తిగా అవగతం చేసుకోవడానికి వీలు కలుగుతుందని పార్టీ జగన్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సానుభుతి ఓట్లను పార్టీకి రాబట్టేందుకు జగన్ ను తిరిగి హైదరాబాద్ పంపించాలన్నది హైకమాండ్ వ్యూహంగా తెలుస్తోంది.
సోనియా గాంధీతో సమావేశం అనంతరం జగన్ ఈరోజో రేపో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. జగన్ ను ముఖ్యమంత్రిని చేసి తీరాల్సిందే అని రాష్ట్రంలో ఆయన వర్గీయులుగా ముద్ర పడిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక వైపు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నప్పటికీ ఢిల్లీకి వచ్చిన జగన్ మాత్రం అపర విధేయుడిలా మాట్లాడటం విశేషం. బుధవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే చుట్టుముట్టిన విలేఖరులతో ఆయన చాలా వినమ్రంగా మాట్లాడుతూ, 'అపాయింట్ మెంట్ కావాలని మేడమ్ ను రిక్వెస్ట్ చేశాను. మమ్మల్ని దయతలచి ఆమె అప్పాయింట్ మెంట్ ఇస్తే ఆమెను తప్పకుండా కలుసుకుంటాం' అని చెప్పారు. బుధవారం రాత్రి సిమ్లా నుంచి తిరిగి వచ్చిన సోనియా గాంధీ గురువారం ఉదయం తనను కలవడానికి అప్పాయింట్ మెంట్ ఇస్తూ రాత్రికి రాత్రే జగన్ కు వర్తమానం పంపించారు.
News Posted: 22 October, 2009
|