పెళ్ళికి 'ధనిష్ఠ' అరిష్టం రాజమండ్రి : పెళ్ళి ముహూర్తాలకు ధనిష్ట నక్షత్రం ఎంత మాత్రం పనికిరాదని ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త మధుర కృష్ణమూర్తి శాస్త్రి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈనెల 28న నిర్వహించతలపెట్టిన కల్యాణమస్తు కార్యక్రమంలో జరిపే పెళ్ళిళ్ళకు నిర్ణయించిన ముహూర్తంపై ఆయన తీవ్రంగా స్పందించారు. పెళ్ళి ముహూర్తాలకు పనికొచ్చే నక్షత్రాలు ఏవి? పనికిరాని నక్షత్రాలు ఏవి? తదితర అంశాలను మహా పండితులు ఎప్పుడో నిర్ణయించారని మధుర చెప్పారు. దీని ప్రకారం ధనిష్ఠ నక్షత్రం ఇతర కార్యక్రమాల ముహూర్తాలకు పనికొస్తుందిగానీ, పెళ్ళిళ్ళకు పనికిరాదన్నారు.
మహాతత్త్వవేత్త, పండితుడు విద్యారణ్య స్వామి రచించిన గ్రంథంలో ధనిష్ఠ నక్షత్రం పెళ్ళి ముహూర్తాలకు పనికిరాదన్న విషయం స్పష్టంగా ఉందన్నారు. ఈ నక్షత్రంలోని ముహూర్తంలో పెళ్ళి చేసుకున్న దంపతుల్లో వధవు కొద్ది రోజుల పాటు అనుకూలంగా ఉండి, తరువాత వదిలిపెట్టి పరాశక్తిగా మారి, ఉభయ కులాలను పాడుచేస్తుందని విద్యా మాధవీయం గ్రంథంలో ఉందని మధుర కృష్ణమూర్తి శాస్త్రి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం 28న ధనిష్ఠ నక్షత్రంలోనే కళ్యాణమస్తు పెళ్ళిళ్ళకు ముహూర్తాలను నిర్ణయించిందని, ఇది సరికాదన్నారు. గ్రహబలంతో పాటు అన్ని రకాల బలాలు ఎంత గొప్పగా ఉన్నా, అమావాస్యరోజున ఎలా పెళ్ళి చేయకూడదో, అలాగే ధనిష్ఠ నక్షత్రంలో పెళ్ళి చేయకూడదని మధుర గట్టిగా చెప్పారు.
అసలు సామూహిక వివాహాల విధానమే సరికాదన్నారు. భగవంతుడు నిర్ణయించిన ముహూర్తం కాబట్టి ఇక ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా కళ్యాణమస్తులో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పడం సరికాదన్నారు. సాక్షాత్తూ శ్రీవెంకటేశ్వరస్వామి వచ్చి జరిపించినా సామూహిక వివాహాల విధానం తప్పని మధుర కృష్ణమూర్తి శాస్త్రి చెప్పారు. సామూహిక వివాహ వ్యవస్థ హిందూ ధర్మశాస్త్రంలో ఎక్కడా లేద్నారు. ఇక్కడ కాలసర్ప దోష ప్రసక్తే లేదన్నారు. కేతువుకు ఎదురుగా వెళ్ళే గ్రహాలైతేనే కాలసర్ప దోషం ఉంటుందని, కానీ ఇక్కడ అలాంటి దోషమేదీ కనిపించటం లేదన్నారు. కాలసర్ప దోష ప్రభావం వ్యక్తులపై ఉండదని మధుర చెప్పారు. పాలకులు, పంటలు, దేశంపైనే కాలసర్ప దోష ప్రభావం ఉంటుందన్నారు. అందువల్ల కాలసర్ప దోషం గురించి ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.
కాలసర్ప దోషం అసలు జాతక, ముహూర్త శాస్త్రంలోనే లేదన్నారు. అది కేవలం జ్యోష్యశాస్త్రంలో మాత్రమే ఉందన్నారు. తిథి, నక్షత్ర, వార, యోగ, కరణ, లగ్నాలకు, గ్రహాలకు కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయని, ఇవేమీ పట్టించుకోని కొంత మంది జ్యోతిష్య పండితులవల్లే అనవసర వివాదాలు చెలరేగుతున్నాయని మధుర కృష్ణమూర్తి శాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యమఘంటం, దోషం, రాహుకాల దోషం ఉండటం వల్ల 28వ తేదీ నాటి కల్యాణమస్తు ముహూర్తాన్ని ముహూర్తకాలం దాటించి నిర్ణయించినట్టు టిటిడి చెప్పడం సరికాదన్నారు. ఈ రెండు దోషాలు అసలు ఆంధ్రప్రదేశ్ కే వర్తించవని, ఇవి కేవలం తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తాయని మధుర కృష్ణమూర్తి శాస్త్రి చెప్పారు.
News Posted: 22 October, 2009
|