రోశయ్యే శాశ్వతం హైదరాబాద్ : ముఖ్యమంత్రి రోశయ్యను అధిష్టానం త్వరలోనే ఢిల్లీకి ఆహ్వానించనుంది. ఆయనే సీఎంగా కొనసాగుతారని స్పష్టమైన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాలను వీలైనంత త్వరలో చక్కదిద్దాలన్న నిర్ణయానికి అధిష్ఠానవర్గం వచ్చినట్లు తెలిసింది. నాయకత్వ సమస్యను నాన్చడం వల్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా రోజు విమర్శలు చేసుకుంటున్నారని, దీనివల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందన్న అభిప్రాయానికి అధిష్టానవర్గం వచ్చినట్లు తెలిసింది. అందువల్ల ఈ నెలాఖరులోగా రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న వివాదాన్ని, నాయకత్వ సమస్యను పరిష్కరించాలని అధిష్టాన వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రిగా రోశయ్యకు తగిన సమయాన్ని ఇవ్వాలని, పార్టీలో అందరినీ కలుపుకొని పోతూ మంచి పాలనను అందించినట్లయితే కొంతకాలం ఆయన్నే కొనసాగించాలని, రోశయ్య పనితీరు తాము ఆశించిన విధంగా లేనిపక్షంలో నాయకత్వ మార్పు విషయాన్ని పరిశీలించాలన్న ఆలోచనతో అధిష్ఠానవర్గం ఉన్నట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి పదవిని జగన్ కు ఇవ్వాలంటూ వైఎస్ వర్గం కోరుతుండగా, రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలంటూ వైఎస్ వ్యతిరేక వర్గం అంటోంది. ఈ అంశంలో వైఎస్ అనుకూల, వ్యతిరేక వర్గాలకు చెందిన నాయకులు రోజూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ పార్టీ ప్రతిష్ఠను బజారునపడేస్తున్నారన్న అభిప్రాయంతో అధిష్ఠానవర్గం ఉన్నట్లు తెలిసింది. అందువల్ల నాయకత్వం విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించి ఇక మీదట ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా ప్రకటనలు, పరస్పర విమర్శలు చేసుకోరాదని రాష్ట్ర పార్టీ నాయకులను అధిష్టానవర్గం గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. తన మనసులో మాటను రాష్ట్రానికిచెందిన కొంతమంది ముఖ్య నాయకులకు మాత్రమే తెలియజేయాలని అధిష్టానవర్గం భావిస్తున్నట్లు తెలిసింది.
'వైఎస్ మరణం తర్వాత సీనియర్ మంత్రి, నాయకుడు అయిన రోశ్యయకు అవకాశం ఇచ్చాం, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సమర్ధమైన పాలనను అందిస్తూ పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, ఇందుకు రోశయ్యకు తగిన వ్యవధి ఇవ్వాలి, అనుకున్న విధంగా రోశయ్య పని తీరు ఉన్నట్లయితే కొంతకాలం ఆయన్నే కొనసాగిస్తాం, లేని పక్షంలో నాయకత్వం మార్పు గురించి ఆలోచిస్తాం' అన్న సమాచారాన్ని కొంతమంది ముఖ్యులకు తెలియజేయాలని అధిష్టానవర్గం భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ ని కలుసుకున్నప్పుడు ఆయనకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయడంతో పాటు 'తొందర పడవద్ద'ని కూడా అధిష్టానవర్గం ఆయనకు చెప్పనున్నట్లు తెలిసింది. అనంతరం ముఖ్యమంత్రి కె రోశయ్యను ఢిల్లీకి పిలిపించి ఇదే విషయాన్ని చెప్పనున్నట్లు తెలిసింది. వైఎస్ సన్నిహితుడైన డాక్టర్ కెవిపికి కూడా చెప్పి వైఎస్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు నచ్చచెప్పాలని, ఎటువంటి వివాదాస్పద ప్రకటనలు చేయకుండా అడ్డుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. వైఎస్ జగన్, ముఖ్యమంత్రి రోశయ్యలతో భేటీ అయిన తర్వాత సిఎల్ పి సమావేశం తేదీని ఖరారు చేసి సిఎల్ పి నాయకుని ఎన్నిక వివాదాన్ని కూడా పరిష్కరించాలని అధిష్టానవర్గం భావిస్తున్నట్లు తెలిసింది.
News Posted: 22 October, 2009
|