కాంగ్రెస్ కు పూర్వవైభవం? న్యూఢిల్లీ : గత రెండు దశాబ్ధాలుగా అనిశ్ఛిత పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో స్థిరమైన ప్రాబల్యాన్ని పెంచుకుంది. తాజాగా మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రల్లోని విజయాలు ఆ పార్టీని మరింత శక్తిమంతంగా మార్చాయి. ఇప్పుడు అధికారాన్ని కొల్పోయిన రాష్ట్రాల్లో పాగా వేయడానికి కాంగ్రెస్ పావులు కదపడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్ సభకు ఎన్నికలు జరిగిన ఆరునెలల్లోపే జరిగిన ఈ ఎనికల్లో లభించిన ఫలితాలు మరీ అనూహ్యం ఏమీ కాదు. కానీ మహారాష్ట్రలో మూడో సారి కాంగ్రెస్ ను పీఠంపై కూర్చోబెట్టడమే దానికి బ్రహ్మండమైన బలం. ప్రభుత్వ వ్యతిరేకత అనేది పదిహేనేళ్ళలో అక్కడ తలెత్తకపోవడం నిజంగానే కాంగ్రెస్ నాయకత్వ ప్రతిభకు తార్కాణంగా భావించవచ్చు.
అరుణాచల్ ప్రదేశ్ లో విజయం కాంగ్రెస్ కు సామాన్యమైనదేమీ కాదు. ఈశాన్య భారతంలో కాంగ్రెస్ అతిపెద్ద జాతీయపార్టీగా అవతరించిందానికి అక్కడ లభించిన అపూర్వ విజయమే సంకేతం. హర్యానా ఫలితాలు అనుకున్నంతగా లేక నిరాశ పరచినా అధికారం చేజారకపోవడం కాంగ్రెస్ కు ఆనందం కలిగించే విషయం.గతంలో ఇక్కడ 67 స్థానాలతో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ ఈ సారి అధికారాన్ని చేపట్టడానకి అవసరమైన 45 స్థానాలను సముపార్జించలేకపోయింది. మరో ఐదుగురి అండ ఆ పార్టీకి అవసరమైంది.
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 206 సీట్లు లభించడమే అసలు సిసలైన రాజకీయ పరిణామం. తన మిత్ర పక్షాలపై ఆధిపత్యం చెలాయించడానికి ఈ సంఖ్య కాంగ్రెస్ కు అంతులేని ధైర్యాన్ని ఇచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం140 సభ్యులతో ఉండి యూపీయే ప్రభుత్వాన్ని నడపటానికి మిత్రపక్షాల గొంతెమ్మ కొర్కెలన్నిటినీ తీర్చవలసి వచ్చేది. ఇప్పడు ఆ సమస్య లేదు. అతి ముదురు డిఎంకే చేసిన బేరసారాలనే కాంగ్రెస్ నాయకత్వం ఈసారి ఖాతరు చేయలేదు. అలానే కొత్త మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ ను కూడా అదుపులో పెట్టగలిగింది. 2004 లో అతి కీలకమైన మంత్రి పదవులను డిఎంకే దక్కించుకుంది. కానీ ఈసారి ఆ పప్పులు ఉడకలేదు. మంత్రి పదవుల సంఖ్యను కోత పెట్టింది. కీలకమైన శాఖలను కాంగ్రెస్ తన వద్దే అట్టేపెట్టుకోగలిగింది.
రెండు దశాబ్ధాలుగా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారానికి దూరంగానే ఉండిపోయింది. ఎఐసిసి ప్రదాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఇప్పుడు అక్కడ రాజకీయ జూదాన్ని ప్రారంభించారు. అలానే తమిళనాడు, ఝార్ఖండ్, బీహర్ రాష్ట్రాలపై ఇప్పటికే ఆయన దృష్టి పెట్టారు. యువజన కాంగ్రెస్ సభ్యత్వం పేరుతో రాహుల్ ఈ రాష్ట్రాల్లో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యువజన సభ్యత్వ వ్యూహం మహరాష్ట్రలో ఫలించిందని తాజా ఫలితాలు నిరూపించాయి. ఇక ఆయన మరింత చురుగ్గా కదిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
News Posted: 22 October, 2009
|