'కేసీఆర్ ను జైల్లో పెట్టొచ్చు' హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు బుధవారం నుంచి సిద్ధిపేట ఉద్యోగల గర్జనలో చేసిన వ్యాఖ్యల పట్ల పోలీసులు కేసు నమోదు చేయవచ్చని న్యాయశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ ను 'ఫ్రీజోన్'గా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఈ సభలో 'తెలంగాణ వాలే జాగో - ఆంధ్రావాలే భాగో' అని కేసీఆర్ పిలుపునిచ్చారు. హింసను ప్రేరేపించడం, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడంతో పాటు, కొన్ని వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు కాగలదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై ఐపీసీ 153, 153 (ఎ), 508, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు. 153 (ఎ) ప్రకారం జన్మస్థలం, నివాసం, భాష, మతం, జాతి పేరిట వేర్వేరు సమూహాల మధ్య విరోధం పెంచేందుకు ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేయవచ్చు! శాంతి భద్రతల పరిరక్షణ కోసం తగిన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద నేర నిరూపణ జరిగితే మూడేళ్ళ జైలు, లేదా జరిమానా లేదా రెండు శిక్షలూ కూడా విధించవచ్చు నని న్యాయ నిపుణులు వివరించారు.
'153 (ఎ) సెక్షన్ పరిధిలోకి వచ్చే కేసీఆర్ వ్యాఖ్యలపై నేరుగా చర్యలు తీసుకోవచ్చు' అని హైకోర్టు న్యాయవాది సుభాష్ చెప్పారు. మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు ఉందని, అదే సమయంలో ఇతర పౌరుల్ని తెలంగాణ లేదా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలనే హక్కు ఆయనకు లేదని చెప్పారు. ఆయన చేసిన ప్రసంగం సెక్షన్ 153 పరిధిలోకి కూడా వస్తుందన్నారు. దాడులు చేయాలని ప్రేరేపించే అంశం ఈ సెక్షన్ పరిధిలోకి వస్తుంది.
మరో సీనియర్ న్యాయవాది సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ తెరాస కత కేసీఆర్ అంత తీవ్ర పదజాలం వాడకూడదని అన్నారు. తెరాసనేతల పరుష వ్యాఖ్యలను 508 సెక్షన్ పరిధిలోకి వస్తుందన్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో న్యాయవాది మాట్లాడుతూ, కేసీఆర్ ప్రసంగాలపై ప్రభుత్వం తనంతట తానే కేసు నమోదు చేయవచ్చని చెప్పారు. 'ప్రభుత్వం ఎవరి ఫిర్యాదు కోసం ఎదురు చూడవలసిన పనిలేదు. చివరకు స్థానిక పోలీసు అధికారి కూడా చర్యలు తీసుకోవచ్చు' అని వివరించారు.
News Posted: 23 October, 2009
|