రోశయ్య సొంత చానల్? హైదరాబాద్: ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్గం తమకంటూ సొంతంగా ఒక టివి చానల్ ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఈనాడు రాతలపై ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం ఆపుకోలేక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనకూ ఒక సొంత బాకా ఉండాలని నిర్ణయించుకోవడం, ఆ వెంటనే ఆయన కుమారుడు వైఎస్ జగన్ 'సాక్షి' పత్రిక పేరిట ఆయన ఆశయాన్ని నెరవేర్చడం జగమెరిగిన సత్యమే.
వైఎస్ హఠాన్మరణంతో అనుకోకుండా తలపై వాలిన కిరీటం జారిపోకుండా నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి రోశయ్య ఎంత కష్టపడి పనిచేస్తున్నారో కూడా తెలిసిన విషయమే. అయితే ఎటొచ్చి ఆయన కష్టాన్ని గుర్తించకుండా కొన్ని పత్రికలు (సాక్షితో సహా) ప్రభుత్వం అవి చేయడం లేదు, ఇవి చేయడం లేదంటూ ఆడిపోసుకుంటూ పనిగట్టుకుని రోశయ్య ప్రతిభను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ధోరణితో విసుగెత్తిపోయిన రోశయ్య వర్గం సొంతంగా ఒక న్యూస్ చానల్ పెట్టి దీనిని ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కొత్తగా న్యూస్ చానల్ ప్రారంభించడం కొరివితో తల గోక్కునట్లువుతుందన్న సత్యం బోధ పడింది కాబోలు...నష్టాలలో కూరుకుపోయి సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేక డేకుతూ, పాకుతున్న రెండు తెలుగు న్యూస్ చానళ్ళతో ఇప్పటికే బేరసారాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అన్నీ సక్రమంగా జరిగిచే మరో నెలరోజుల్లోనే రోశయ్యకు కూడా భజంత్రీ చానల్ ఒకటి ప్రసారాలను ప్రారంభించే అవకాశం ఉంది.
News Posted: 23 October, 2009
|