ఒరియా కాదు ఒడియా! న్యూఢిల్లీ : 'బెంగళూరు' వాడకానికి క్రమంగా అలవాటు పడుతున్న సమయంలో మన పదజాలంలో ఉచ్చారణకు కొంత శ్రమ పడవలసిన పదాలు వేరేవి చేరాయి. ఒరిస్సాను ఇకమీదట 'ఒడిశ' అని అనాలి. ఒరియాను 'ఒడియా' అని పేర్కొనాలి. మరి 'పేరులో ఏముంది' అని ఎవరైనా అడగవచ్చు. కాని అటువంటి సందేహాలు వచ్చేవారు సినీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ తో ఒకసారి మాట్లాడితే చాలు. తన 'వేక్ అప్ సిద్' చిత్రంలో ముంబై అనడానికి బదులు 'బొంబాయి' అని వాడినందుకు కరణ్ జోహార్ బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా అలా వాడడం పొరపాటేనన్న ప్రకటనను చిత్రం టైటిల్స్ లో పొందుపరచవలసి వచ్చింది కూడా.
ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగకపోవడమే రాజకీయంగా సముచితం అని భావిస్తున్న సమయంలో ఈ పేరు మార్పునకు కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశంలో చర్చ లేకుండానే ఆమోద ముద్ర వేసింది. దీనికి త్వరలో పార్లమెంట్ ఆమోద ముద్ర కూడా లభించనున్నది.
శివసేన పార్టీ బొంబాయిని ముంబైగా మార్చగా అటువంటి రాజకీయ నిర్బంధాలే కలకత్తాను కోలకతాగా మార్చేట్లు చేశాయి. కాని ప్రాంతీయ డిమాండ్లతో రాష్ట్రం లేదా భాష లేదా వీధి లేదా కనీసం కూడలి (చౌక్) అయినా పేరు మార్చిన ఉదంతాలు మన చరిత్రలో కోకొల్లలు. బ్రిటిష్ వారు పెట్టిన పేర్లను భారతీయత ఉట్టిపడేలా మార్చడమనేది రాజకీయ వాదులకు కాలక్షేపంగా మారిపోయింది. అయితే, అలా పేరు మార్పు వల్ల ప్రయోజనం చేకూరుతుందా అనే సమాధానం దొరకని ప్రశ్న.
ఈ ప్రతిపాదిత మార్పునకు రాజ్యాంగంలోని మొదటి, ఎనిమిదవ షెడ్యూల్ కు సవరణ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇది త్వరలో పార్లమెంటు ముందుకు రావచ్చు. రాష్ట్రం పేరును ఒడిశగాను, అధికార భాషను ఒరియా నుంచి ఒడియాగాను మార్చాలని కోరుతూ ఒరిస్సా శాసనసభ గత ఆగస్టులో ఒక తీర్మానాన్నిప్రవేశపెట్టింది. ఈ పేర్లను తప్పుగా వాడుతున్నారని శాసనసభ ఇందుకు కారణంగా పేర్కొన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ దీనిన మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాష్ట్రం పేరును తప్పుగా రాస్తున్నందున ఉచ్చారణలో తేడాలు ఉంటుండడంతో పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నదని అధికారులు తెలియజేశారు. రాష్ట్రం పేరును హిందీలో 'ఉడిశ'గాను, ఇంగ్లీషులో 'ఒరిస్సా'గాను రాస్తున్నారు.
స్వాతంత్ర్యానంతరం పేరు మార్పు జరిగిన ప్రధాన నగరాలలో కాన్పూర్ (లోగడ కాన్ పోర్ ఇంగ్లీష్ లో cawnpore), తిరువనంతపురం (త్రివేండ్రం), ముంబై (బొంబాయి), చెన్నై (మద్రాసు), కోలకతా (కలకత్తా), పుణె (పూనా), కొచ్చి (కొచ్చిన్) ఉన్నాయి.
News Posted: 24 October, 2009
|