హైదరాబాద్ : ఉగ్రవాదుల కార్యకలాపాల నిరోధానికి ప్రభుత్వం రెండేళ్ళ క్రితం నెలకొల్పిన ఆక్టోపస్ (ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్స్) ఉనికి నామమాత్రంగా మారుతోంది. ముంబాయిలో 26/11 దాడుల నేపథ్యంలో దేశంలో ఏ ప్రాంతంలోనైనా... (హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్నది వేరే సంగతి) దాడులు జరకుండా చూసుకోవాలని కేంద్రం తాపత్రయపడుతున్న నేపథ్యంలో ఆక్టోపస్ మరింత క్రియాశీలకం కావాల్సిన అవసరం ఉంది. కానీ.. వాస్తవ పరిస్థితులు అలా లేవు. ఇటీవల ఆక్టోపస్ సిబ్బందికి ఆయుధాలు కొనాలని అధికారులు ప్రతిపాదించినప్పుడు.. మాజీ డీజీపీ వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. మావోయిస్టులతో వీరోచితంగా పోరాడుతున్న గ్రేహౌండ్స్ ను.. కొన్ని ఆయుధాలను ఆక్టోపస్ కు ఇవ్వాలని ఆదేశించారు. 2007లో ఆక్టోపస్ ను ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక సమస్య దాన్ని వెన్నాడూతూనే ఉంది. మావోయిస్టులు తిరిగి రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కొన్ని ఆయుధాలను ఆక్టోపస్ కు ఇవ్వాలని డీజీపీ ఆదేశించడం గ్రేహౌండ్స్ బలగాలను కలవర పరిచింది.
మరోవైపు స్పెషల్ బ్రాంచ్ పై ఆక్టోపస్ విభాగం ఆధారపడవలసిన పరిస్థితులు పెరిగాయి. తమ పరిధిలో అనుమానం ఉన్నవారి ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేయడానికి అవసరమైన అధునాతన పరికరాలు కూడా ఆక్టోపస్ వద్ద లేవు. దీంతో తమ ఆవరణలోనే ఉన్న ఎస్ బీఐ పై ఆక్టోపస్ ఆధారపడుతోంది. అనుమానితుల ఫోన్ కాల్స్ లోకి చొరబడి సమాచారాన్ని సేకరించేందుకు అవసరమైన పరికరాల కోసం ఉన్నతాధికారులకు వినతి చేసి... 'ఇబ్బంది' పడేకన్నా అందుబాటులో ఉన్న ఎస్ఐబీ 'సహాయాన్ని' తీసుకోవడమే సమంజసంగా ఉంటుందని ఆక్టోపస్ అధికారులు భావిస్తున్నారు. 'మా రాడార్ పరిధిలోని వ్యక్తుల కాల్స్ ను అటకాయించి... సమాచారాన్ని సేకరించాలంటే పూర్తిగా ఎస్ఐబీ పై ఆధార పడ్డాం. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది' అని ఆక్టోపస్ వర్గాలు పేర్కొన్నాయి. ఆక్టోపస్ ఇప్పటి వరకు రెండు కేసులే దర్యాప్తు చేసినట్టు తెలుస్తోంది. వీటిలో ఒకటి - పోలీసులపై కాల్పులు జరిపి పరారైన ఉగ్రవాది వికార్ అహ్మద్ కేసు. ఫలక్ నామాలో మాస్క్ లు ధరించి హోంగార్డును హత్య చేసిన ఉదంతం రెండోది.