వీడియోలో గణపతి దర్శనం! హైదరాబాద్: మూడు దశాబ్దాలుగా అజ్ఞాతవాసంలో ఉంటూ దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని ఉత్కృష్ణమైన దశకు తీసుకు వచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి అకస్మాత్తుగా వీడియోలో ప్రత్యక్షం అయ్యారు. 2007 జనవరి, ఫిబ్రవరి మాసాలలో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల సరిహద్దులోని బీంబంద్ అడవుల మధ్య జరిగిన సిపిఐ మావోయిస్టు తొమ్మిదవ మహాసభలో గణపతి ప్రసంగిస్తుండగా రికార్డు చేసిన వీడియో చిత్రం అది. ఇటీవల పశ్చిమ బెంగాలలో పారా మిలిటరీ దళాలు మావోయిస్టుల ఏరివేత కోసం జరిపిన కూంబింగ్ లో లభ్యమైన మావోయిస్టు కిట్ బ్యాగ్ లలో ఈ వీడియో సిడి కనిపించింది. దీనిని చేజిక్కించుకున్న కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఈ వీడియోను గుట్టు చప్పుడు కాకుండా ఢిల్లీ నుంచి వెలువడే హిందుస్తాన్ టైమ్స్ దినపత్రికకు వారం క్రితం లీక్ చేసింది. అనంతరం వీడియో క్లిప్ ను యూట్యాబ్ సైట్ లో కూడా అప్ లోడ్ చేసింది.
వారం రోజుల క్రితమే 'ఎక్స్ క్లూజివ్' పేరిట హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఈ వీడియోలోని చిత్రాలతోపాటు పార్టీ మహాసభలో గణపతి ప్రసంగ పాఠాన్ని సవివరంగా మొదటి పేజీలో ప్రచురించింది. హిందుస్తాన్ టైమ్స్ లో గణపతి వీడియోకి సంబంధించిన వార్త వెలువడిన తర్వాతే ఆ వీడియో యూట్యూబ్ కు కూడా ఎక్కింది. శనివారం ఉదయమే ఈ వీడియో క్లిప్ తో ముందుగా ఒక న్యూస్ చానల్ గణపతి వీడియో వార్తను బ్రేక్ చేయడంతో ఇక అన్ని చానళ్ళు ఈ క్లిప్ ను వెదికి పట్టుకుని తమ తమ సొంత కథనాలతో చాకిరేవు పెట్టేశాయి. ఆదివారం ఉదయం నాటికి దినపత్రికలు తాము సైతం అంటూ వార్తా కథనాలను ప్రచురించాయి.
సందట్లో సడేమియా అంటూ గణపతి లొంగిపోతున్నట్లుగా మరి కొన్ని ఊహాగానాలు బయల్దేరాయి. లొంగుబాటుకు అవసరమైన భూమికను రూపొందించేందుకు ఈ వీడియోను యూట్యూబ్ లో పెట్టి ఉండవచ్చన్న అనుమానాలను మీడియా లేవనెత్తింది. అయితే ఈ వాదనలను మావోయిస్టు పార్టీ కొట్టిపారేసింది. గణపతి వీడియా ప్రసంగాలు ఇంటెలిజెన్స్ వర్గాల సృష్టి అని ఆరోపించింది. ఓ ఎన్‌కౌంటర్‌లో దొరికిన పాత సీడిలతో పోలీసులు కొత్త నాటకాకి తెరలేపారని పార్టీ వర్గాలు ఆరోపించాయి. మావోయిస్టు కేడర్‌ను గందరగోళానికి గురి చేసేందుకు నిఘా వర్గాలు పన్నిన కుట్రగా అభివర్ణించింది. విప్లవ రచయతల సంఘం నాయకుడు వరవరరావు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల సందర్భంగా బయటకు వచ్చిన గణపతి క్నొ సందర్భాల్లో చేసిన ప్రసంగాలను పోలీసులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నట్టు ప్రజా సంఘాల నేతలు అంటున్నారు.
News Posted: 25 October, 2009
|