సిఎల్పీ...తర్వాత అసెంబ్లీ హైదరాబాద్: 'మేడమ్' చెప్పు చేతల్లో నడవడానికి జగన్ అంగీకరించడంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించింది. మహారాష్ట్ర, హర్యానా ముఖ్యమంత్రుల నియామకరంలో తనమునకలై ఉన్న పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం రాత్రికి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసినందున ఇక రాష్ట్ర వ్యవహారాన్ని తక్షణమే ఒక కొలిక్కి తీసుకువస్తారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ శాసన సభా పక్షం (సిఎల్పీ) సమావేశం జరగకుండానే ముఖ్యమంత్రిగా రోశయ్య నియామకం జరిగింది. సిఎల్పీ ఎన్నుకోకుండా పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందంటూ ఇప్పటికే హైకోర్టులో ఒక ప్రజా వాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. వాస్తవానికి దీని వలన వచ్చే ముప్పేమీ ఉండకపోయినప్పటికీ రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలంటే సిఎల్పీ చేత 'మమ' అనిపించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
దీనివలన భవిష్యత్తులో ఎవరికి రోశయ్య అధికారాన్ని ప్రశ్నించే హక్కు, అధికారం ఉండదు. కాబట్టి ఈనెలాఖరున సిఎల్పీ సమావేశం నిర్వహించాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. దీనికి ముందు రోశయ్య ఢిల్లీకి వెళ్ళి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోను, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తోను విడివిడిగా సమావేశమవుతారు. వచ్చే రెండు మూడు రోజులలో రోశయ్య ఢిల్లీకి బయల్దేరే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సోమ లేదా మంగళవారాలలో రోశయ్య ఢిల్లీ పర్యటన ఉంటే శాసనసభా పక్ష సమావేశాన్ని ఈ నెల 28నే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి సంతాపం తెలపడంతోపాటు సిఎల్పీ నాయకుడి ఎంపిక కూడా పూర్తి చేసేలా అజెండా ఉంటుందని తెలుస్తోంది.
సిఎల్పీ సమావేశంలో రోశయ్య ఎంపిక లాంఛనంగా పూర్తయిన అనంతరం దివంగత ముఖ్యమంత్రికి నివాళులు అర్పించేందుకు శాసనసభను సైతం సమావేశపరచ వలసిందిగా పార్టీ అధిష్టానం ఇప్పటికే రోశయ్యకు సూచించింది. ఈ సమావేశంలోనే రాష్ట్రంలో సంభవించిన వరదలు, కరవుపై చర్చ కూడా జరుగుతుంది. పార్టీ అధిష్టానం సూచన మేరకు అయిదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రాగం కసరత్తు ప్రారంభించింది. సిఎల్పీ నాయకుడిగా రోశయ్య ఎంపిక తర్వాత ఈ సమాచారాన్ని రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ కు లాంఛనంగా తెలియచేయాల్సి ఉంది. ఆ తర్వాతే అసెంబ్లీ సమావేశాలకు అవసరమైన నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది.
News Posted: 25 October, 2009
|