ఇదో 'కైంకర్యం' హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలకు నిధులు విడుదల చేస్తూండడంతో కొన్ని జిల్లాల్లో దేవాదాయ శాఖ అధికారుల దృష్టి ఈ నిధులపై పడింది. ధూపదీప నైవేద్యాల నిమిత్తం ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులను 'కైంకర్యం' చేసేందుకు వీరు లేని ఆలయాలను రికార్డుల్లో సృష్టిస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారుల వైఖరి చూస్తే గుడిని, గుడిలో లింగాన్నే కాదు, రాష్ట్ర ఖజానానే మింగేసే విధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బక్కచిక్కిన ఆలయాల కోసం ప్రతినెలా ధూపదీప నైవేద్యాల కోసం భారీగా నిధులు విడుదల చేస్తోంది. ఆలయాల మనుగడ, అర్చకులకు జీతాలు అందే సౌలభ్యం కోసం వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధాన్ని ప్రవేశపెట్టింది. దీనిని తమకు అవకాశంగా మార్చుకుంటున్న కొంతమంది దేవాదాయ శాఖ అధికారులు లేని ఆలయాలను కూడా జాబితాలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
వెబ్ సైట్లో పొందుపరచేందుకు తమతమ జిల్లాలోని ఆలయాల వివరాలు అందించాలని అన్ని జిల్లాల దేవాదాయ శాఖ అధికారులకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ మేరకు దాదాపు అన్ని జిల్లాల నుండి ఆలయాల వివరాలు కూడా వచ్చాయి. అయితే అంతకుముందుగా జూన్ నెల్లో సాధారణ వివరాలు పంపిస్తూ ఇచ్చిన ఆలయాల వివరాలకు, వెబ్ సైట్లో పొందుపరిచేందుకు ఇచ్చిన ఆలయాల వివరాలకు మధ్య భారీగా తేడా కనిపించడంతో దేవాదాయ శాఖ అధికారులు విస్తుపోయారు. దీంతో వాస్తవాలు తెలియజేయాలంటూ దేవాదాయమంత్రిత్వ శాఖ కొన్ని జిల్లాలకు నోటీసులు జారీ చేసింది.
ప్రధానంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల నుండి జూన్ నెల్లో వచ్చిన వివరాలకు తాజాగా అక్టోబర్ లో వచ్చిన వివరాలకు మధ్య భారీగా తేడా కనిపించింది. దాదాపు 350 ఆలయాలు ఎక్కువగా ఉన్నట్లు అక్టోబర్ నివేదికలో చూపించినట్లు గుర్తించారు. కేవలం మూడు నెలల్లో ఇన్ని ఆలయాలు ఎలా పెరిగాయన్నది అర్థం కాని ఉన్నతాధికారులు ఈ విషయంపై సంబంధింత జిల్లాలను వివరణ కోరారు. కాగా, మరికొన్ని జిల్లాల నుండి గతంలో ఇచ్చిన వివరాల కన్నా తక్కువ ఆలయాలు ఉన్నట్లు కొత్తగా పంపించిన జాబితాలో ఉన్నాయని తెలిసింది. ఇలా ఉండగా, ఆలయాలను ఎక్కువగా చూపించడం ద్వారా ధూపదీప నైవేద్యాల నిధులను కైంకర్యం చేసేందుకు ఇటువంటి తప్పుడు జాబితాలు తయారవుతున్నట్లు దేవాదాయ శాఖకు చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మంత్రి గాదె వెంకటరెడ్డి కూడా సరైన వివరాలు సత్వరమే పంపించాలని ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించారు.
News Posted: 26 October, 2009
|