కామ్రేడ్ల 'కాల' జ్ఞానం న్యూఢిల్లీ : కమ్యూనిస్టులు పార్టీ పదవుల్లో పాతుకుపోతారు. వాళ్ళకు పదవీ విరమణ ఉండదు. ఒకసారి పార్టీ పదవుల్లో కూర్చున్నవారు బతికున్నంత కాలం కుర్చీలకు అతుక్కుపోతారు. ద్వీతీయ శ్రేణి నాయకులకు అవకాశం ఇవ్వరు... ఇలాంటి అపప్రధలకు ఇకపై ఎర్రజెండా చూపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ-మార్క్స్ స్ట్ (సిపిఎం) అధినాయకత్వం భావిస్తోంది. పార్టీలోని ఆర్గనైజింగ్ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులకు పదవీ కాలాన్ని పరిమితం చేయాలన్న చర్చ మొదలైంది. ఇది పార్టీలోని అత్యున్నత స్థాయి విషయంలో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ప్రస్తుతం ప్రకాష్ కారత్ ఉన్నారు. ఈ పదవికి కూడా కాలపరిమితి నిర్ణయిస్తూ నిబంధనలను రూపొందిచాలనే ప్రతిపాదన వస్తోందని చెబుతున్నారు. దిగువస్థాయి శాఖలు, స్థానిక, ప్రాంతీయ, జోనల్, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యదర్శుల పదవుల్లో ఒక వ్యక్తిని నిర్ధేశిత కాలం వరకూ మాత్రమే ఉంచాలన్న ప్రతిపాదనపై సిపిఎం కేంద్ర కమిటీ ఈ వారంతంలోగా చర్చించబోతున్నదని పార్టీలోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అలానే రాష్ట్ర కార్యదర్శులకు కూడా పరిమిత కాలాన్ని విధించాడానికి కసరత్తు జరుగుతోంది.
దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటే పార్టీ పదవుల్లో కాల పరిమితి విధానాన్ని అమలు చేస్తోంది. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడేళ్ళుకు మించి కొనసాగే అవకాశం బిజేపీలో లేదు. ఆ వ్యక్తి మళ్ళీ పదవి పొందాలంటే మధ్యలో విరామం అవసరం. బిజేపీ ఈ విధానాన్ని చాలా నిబద్ధతతో అమలు చేస్తూ వస్తోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో సిపిఎం కూడా దారుణంగా దెబ్బతింది. దాంతో నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పదవీ కాలానికి పరిమితి కాలాన్ని విధించాలన్న విధానం అమలు చేస్తోంది దానికి ప్రాయశ్ఛితంగా కాదని, ఒకే వ్యక్తి అధిక కాలం పదవిలో కొనసాగితే నాయకత్వ ఆలోచన ధోరణిలో స్తంభన ఏర్పడుతోందని, తాను ఉన్నంత కాలం పదవి గ్యారెంటీ అని తెలిసిపోవడంతో ఒకలాంటి జఢత్వం వస్తోందని దానిని నిరోధించడానికే ఈ కొత్త ప్రతిపాదన తెర పైకి తెచ్చామని వివరిస్తున్నారు.
ఈ పద్దతిని కార్యదర్శులకే పరిమితం చేయకూడదని, పోలిట్ బ్యూరో సభ్యుల నుంచి శాఖల నాయకత్వానికి కూడా వర్తింపచేయాలని కేంద్ర కమిటీలోని ఒక సభ్యుడు ప్రతిపాదించారని తెలిసింది. కానీ దీనికి పార్టీ నాయకత్వం సుముఖంగా లేదని అయితే కేంద్ర కమిటీ సభ్యుని పదవిలో ఒక వ్యక్తి మూడు సార్లకు మించి కొనసాగరాదనే ప్రతిపాదనకు మాత్రం సానుకూలత ఉందని చెబుతున్నారు. అలా అయిన ఆపదవి తొమ్మిదేళ్లు ఉంటుంది. ఎందుకంటే 1982 నుంచి సిపిఎం మూడేళ్లకు ఒకసారి జాతీయ మహాసభలను నిర్వహిస్తోంది. ఆ కాలపరిమితే పదవీ కాలానికి కూడా గడువుగా ఉంటుందని భావించాలి. ఇక రాష్ట్ర మహసభ రాష్ట్ర కార్యదర్శిని, కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకుంటుంది. అదే విధానాన్ని అట్టడుగు శాఖ వరకూ అనుసరిస్తారు. 2011 లో జరిగే పార్టీ 20 వ జాతీయ మహాసభ కాలపరిమితి విధానాన్ని గానీ ఆమోదిస్తే ప్రస్తుతం ఉన్న చాలా మంది సీనియర్ కామ్రేడ్లు పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. వారు సాధారణ సభ్యుల్లా పార్టీలోకొనసాగవలసి ఉంటుంది.
News Posted: 26 October, 2009
|