వచ్చే ఏడాదిలో 'టి' ఛానల్ హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి మీడియా రంగంలో కూడా తనదైన ప్రయోగాన్ని చేయడానికి సిద్ధమైంది. దేశంలో ప్రాంతీయ పార్టీలు కొత్తకానప్పటికీ.. ఏకంగా టీవీ ఛానల్ ను ప్రారంభించాలని భావించడం కొత్తపోకడే. తెరాస సీనియర్ నేత, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ కథనం ప్రకారం 2010 మే కల్లా తెలంగాణ టెలివిజన్ ఛానల్ ను ప్రారంభించాలని తెరాస భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు వినోద్ కుమారే నాయకత్వం వహిస్తారని తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ప్రాముఖ్యత, సంస్కృతీ పరిరక్షణ తదితర అంశాలలో ప్రజలను జాగృతం చేయడమే లక్ష్యంగా తమ ఛానల్ పనిచేస్తుందని వినోద్ కుమార్ చెప్పారు.
అదే విధంగా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మెట్ట ప్రాంత రైతులకు వ్యవసాయంలో తోడ్పడే కార్యక్రమాలను ప్రసారం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. తెలంగాణ ప్రాంతంలోని వనరుల గురించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. ఛానల్ కు సంబంధిత అనుమతుల కోసం ప్రభుత్వానికి ఈ ఏడాది లోగా సమగ్ర నివేధికను సమర్పిస్తామని 2010 మేకల్లా ఛానల్ ప్రారంభమవుతుందని వినోద్ తెలిపారు. కేవలం తెలంగాణ సమస్యలను సంస్కృతిని ప్రచారం చేసే ఈ ఛానల్ లో వార్తా బులిటెన్ లు ఉంటాయా లేవా అన్న విషయాన్ని ఇంకా చర్చించలేదన్నారు. తెరాస అనుబంధ సంస్థ తెలంగాణా జాగృతికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ కుమార్తె కవిత కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన ఆధారాలను, అంశాలను సేకరించడంలో ఆమె గుణాత్మక పాత్ర ఉంటుంది. ఛానల్ కోసం ఎన్నా రై ల నుంచి పెట్టుబడులను, ఆకర్షించే అంశాన్ని తోసిపుచ్చలేదు. ' రెండు రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఎన్నారైతో కలిసి' ప్రయివేటు కంపెనీని ఏర్పాటు చేయడం లేదా పార్టీయే సొంతంగా ఛానల్ ను నిర్వహించడం' అని వివరించారు.
News Posted: 26 October, 2009
|