జగన్ కు పెద్ద లోగిలి న్యూఢిల్లీ : పాపం ముఖ్యమంత్రి పదవీ పోటీ నుంచి బలవంతంగా వైదొలగి ఉండవచ్చు. కానీ ఢిల్లీ అధిష్టానంలో ఆయనకు ఉన్న ఇమేజ్ అరంగుళం కూడా తగ్గలేదు. ఇంతవరకూ దేశ చరిత్రలో మొదటిసారి ఎంపికైన ఏ పార్లమెంట్ సభ్యునికీ దక్కని అరుదైన గౌరవంతో అధిష్టానం తన ప్రేమను ప్రకటించింది... జగన్ ఇప్పుడు దేశ రాజధానిలో కూడా చర్చల్లో వ్యక్తయిపోయారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ తనయుడికి ఢిల్లీలో అతి ఖరీదైన ప్రాంతంలో సువిశాలమైన లోగిలిని కేటాయించి, జగన్ ప్రత్యేకతను అందరికీ చాటిచెప్పింది కేంద్రం. 26-లోథీ ఏస్టేట్ లోని VII తరహా భవంతిని కడప ఎంపీ జగన్ కు కేటాయిస్తూ నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎస్టేట్ డైరెక్టరేట్ ప్రతిపాదనలు పంపింది.
సాధారణంగా VI, VII భవంతులను కేంద్ర సహాయ మంత్రులకు, సీనియర్ పార్లమెంట్ సభ్యులకు మాత్రమే కేటాయిస్తారు. మొదటిసారి ఎంపీ అయిన వారికి విపీ హౌస్, నార్త్ ఎవెన్యూ, సౌత్ ఎవెన్యూ, విశ్వంభర్ దాస్ మార్గ్ లోని అపార్టుమెంటులను మాత్రమే ఇస్తారు. ఈ నిబంధన నుంచి కొంత మినహాయింపు గతంలో సచిన్ పైలట్, జితిన్ ప్రసాద్ లకు లభించింది. వారు మొదటిసారి ఎన్నికైనా తమ తండ్రులకు కేటాయించి బంగ్లాలే తమకు కేటాయించాలని అభ్యర్ధించి వాటిలో కొనసాగుతున్నారు.
జగన్ కు ఏకంగా 26- లోథీ ఎస్టేట్లో అతి విశాలమైన లోగిలి కేటాయించేసరికి ఢిల్లీలో చాలా మంది పెద్దలు కళ్ళెగరేస్తున్నారు. కేంద్ర రాజకీయాలలో జగన్ చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నారని సూచించడానికే అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ భవంతిని కేటాయించేలా చూసిందనే గుసగుసలు మొదలయ్యాయి. జగన్ కు ఇచ్చిన బంగ్లాను బట్టి ఆయన కేంద్ర కేబినెట్ లో సహాయ మంత్రి పదవిని స్వీకరించే అవకాశం ఉందని, కేబినెట్ మంత్రి హోదా మాత్రం లభించడం లేదని ఈ కేటాయింపు వల్ల అర్దం చేసుకోవచ్చని కూడా అంటున్నారు. అయితే అధికారులు మాత్రం మరోలా చెబుతున్నారు. పార్లమెంటుసభ్యునిగా సీనియారిటీతో సంబంధం లేకుండా VII తరహా బంగ్లాను పొందటానికి కేబినెట్ హోదా మంత్రులు మాత్రమే అర్హులని వివరిస్తున్నారు. నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేసిన ఈ కేటాయింపును వసతి కల్పన కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉందని వారు చెప్పారు. రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి జగన్ కు అధిష్టానం సూచించి రాజీ ఫార్ములా ప్రకారం సహాయ మంత్రి పదవిని ఆయనకు కేటాయిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.
News Posted: 26 October, 2009
|