దింపు యంత్రానికి రూపకల్పన తిరువునంతపురం(కేరళ) : చెట్టక్కకుండా కొబ్బరికాయలు కోసే యంత్రానికి రూపకల్పన చేసే పోటీకి మంచి స్పందన లభించింది. ఈ పోటీని కేరళ పరిశ్రమల శాఖ ఈ పోటీని పెట్టింది. మనుషులు చెట్లు ఎక్కకుండా కింద నుంచే దింపు తీసుకునే యంత్రాన్ని రూపొందిస్తే పది లక్షల రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఎంట్రీలకు గడువు ఆదివారంతో ముగిసిందని ఈ పోటీకి 350 మంది పోటీదారులు తమ ఎంట్రీలను పంపించారని అధికారులు తెలిపారు. వీరిలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధులతో పాటు శాస్త్రవేత్తలు, కంపెనీలు, యంత్ర పరికరాల తయారీదారులు కూడా ఉన్నారని చెప్పారు. జపాన్ నుంచి ఒకటి, ఇజ్రాయేల్ నుంచి ఒకటి ఎంట్రీలు వచ్చాయన్నారు.
నారికేళ వృక్షాలతో అలరారే కేరళలో ఇటీవల కాలంలోదింపులు తీసే వారే కరువై పోయారు. పొడవైన చెట్లను ఎక్కి కొబ్బరి కాయలను తీయడం చాలా నైపుణ్యం అవసరమైన వృత్తి. గతంలో దీనిపైనే ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతికేవి. కానీ ఇప్పుడు వారి పిల్లలు ఈ వృత్తి పట్ల విముఖంగా ఉన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి చేసే ఈ వృత్తి జీవితంలో పేదరికాన్నే మిగుల్చుతోంది. దాంతో కొ్త్త తరం చక్కగా చదువుకుని ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. దాంతో కేరళలో దింపుతీత బృందాలు కనుమరుగైపోతున్నాయి. 45 రోజులకు ఒకసారి చెట్ల నుంచి కాయలు దించవచ్చు. ఇటీవల నెలలు తరబడినా దింపులు తీయడం లేదు.
ఈ సమస్యను చెట్టెక్కించడానికి కేరళ పరిశ్రమల శాఖే స్వయంగా నడుంబిగించింది. దింపు యంత్రం చాలా సులువుగా ఉపయోగించేదిగా ఉండాలని, మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా దీనిని ఉపయోగించడానికి వీలుగా ఉండాలని, కేవలం కాయలు తీయడమే కాకుండా చెట్టు తల భాగంలో గుబురుగా పెరిగిపోయే పీచును, ఎండిన కొబ్బరి మట్టలను, డొక్కలను కూడా తొలగించడానికి ఉపయోగపడాలని పోటీ నిబందనల్లో పెట్టారు. ఈ పోటీకి 16 మంది మహిళలు కూడా తమ డిజైన్లను పంపించడం విశేషం. ఈ యంత్రం వస్తే దింపు వృత్తిని నమ్ముకున్నవారి పొట్టలు కొడుతుందని ఆందోళన వ్యక్తమైనా, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని దీని తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చిన డిజైన్ల ను అన్నింటినీ పరిశీలించి ఎనిమిది డిజైన్లను ఎంపిక చేస్తారు. వాటికి యంత్ర రూపం ఇచ్చి పని తీరును పరిశీలిస్తారు. అనంతరం యంత్ర తయారీకి ప్రభుత్వం సహాయం అందచేస్తుంది.
News Posted: 26 October, 2009
|