పుణ్యక్షేత్రాలకు పూర్వ శోభ హైదరాబాద్ : వరద బీభత్సానికి దారుణంగా దెబ్బతిని దాదాపు నెలరోజుల పాటు వెలవెలపోయిన పుణ్యక్షేత్రాలు కార్తీక మాసం పుణ్యమా అని కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో శివాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. కార్తీక సోమవారం కావడంతో శ్రీశైలం లాంటి ప్రసిద్ధ క్షేత్రాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇంతకాలం ధూప, దీప నైవేద్యాలకు దూరమైన దేవుళ్ళ ప్రాంగణాలు మళ్ళీ భక్తుల రాకతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. కార్తీక మాసంలో సాధారణ రోజుల్లో 30 వేల వరకు, కార్తీక సోమవారాల్లో 70 వేలక పైగా భక్తులు వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటారు.
ఈ సంవత్సరం వచ్చిన వరద కారణంగా మొదటి కార్తీక సోమవారం కూడా భక్తుల సంఖ్య 19 నుంచి 20 వేల లోపే ఉంది. ఆ తరువాత కూడా సాధారణ రోజుల్లో భక్తుల సంఖ్య 8, 9వేలకు మించలేదు. అయితే ఆలయ అధికారులు మాత్రం మూడు, నాలుగు సోమవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో రావచ్చని అంచనా వేశారు. వారి అంచనాకు తగ్గట్టే రెండవ సోమవారం నాడు శ్రీశైలానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. సుమారు 48వేల మంది భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కార్తీక మాసంలో శోభాయమానంగా ఉండే ఆలయం, ఆలయ ప్రాంగణం, శ్రైశైల పురవీధులు భక్తుల లేక వెలవెలబోతున్నాయి. అయితే సోమవారం భక్తుల రాక కొంత పెరగడంతో మరో సోమవారానికి కార్తీక శోభ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
గత 25 రోజులుగా తుంగభద్ర వరద ఉదృతికి దెబ్బతిన్న మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం నెమ్మదిగా మళ్ళీ ఆథ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఆదివారం వేద పండితులతో సంప్రోక్షణ చేసి పూజలు, హోమాలు నిర్వహించి బృందావనాలకు తుంగభద్ర జలాలతో అభిషేకం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రహ్లాదరాయుల వారిని పట్టు వస్త్రాలతో అలంకరించి బంగారు, వెండి రథోత్సవాలపై ఊరేగించారు. కాగా కార్తీక మాసం సందర్భంగా సోమవారం మఠం ప్రాంగణంలో గ్రామస్తులు, భక్తులు, కార్తీక దీపాలు వెలిగించారు. అదే విధంగా యాజమాన్యం మఠాన్ని అందంగా అలంకరించడానికి ముమ్మరంగా చర్యలు చేపట్టింది. మంత్రాలయానికి పూర్వవైభవం వస్తుందని మఠం యాజమాన్యం పేర్కొంటోంది. భక్తులు కూడా మంత్రాలయం వచ్చి రాఘవేంద్రస్వామిని దర్శించుకుని సేవల్లో పాల్గొనాలని మఠం యాజమాన్యం కోరింది.
News Posted: 27 October, 2009
|