చెంపదెబ్బతో మూగకు మాటలు బదౌన్ (ఉత్తర ప్రదేశ్) : ఉత్తర ప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో ఒక విడ్డూరం జరిగింది. ఒక ఉపాధ్యాయుడు కోపంతో చెంపదెబ్బ కొడితే ఒక పుట్టు మూగకు మాటలు వచ్చాయి. ప్రమోద్ కశ్యప్ ఏడేళ్ల కుమారుడు దీపక్ మూగవాడు. కాని అతనికి మాట్లాడే శక్తి లేదని తెలియని ఉపాధ్యాయుడు రాధేశ్యామ్ చాచిపెట్టి చెంప దెబ్బ కొట్టిన తరువాత హఠాత్తుగా అతను మాట్లాడసాగాడు.
జిల్లా కేంద్రం బదౌన్ పట్టణానికి దాదాపు ఇరవై కిలో మీటర్ల దూరంలో వజీర్ గంజ్ ప్రాంతంలోని భరద్వాజ్ మాంటిసోరి పాఠశాలలో ఒకటవ తరగతిలో కొద్ది రోజుల క్రితమే దీపక్ చేరాడు. క్లాసులో దీపక్ ను టీచర్ ఒక ప్రశ్న అడిగాడు. కాని అతని నుంచి సమాధానం రాకపోవడంతో ఆగ్రహం పట్టలేని టీచర్ ఆ చిన్నారిని చెంప దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు అతనికి మాట్లాడే శక్తి వచ్చింది.
ఇది ఇలా ఉండగా, ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీపక్ కు మాట్లాడే శక్తి తెప్పించేందుకు వైద్యులు చేసిన చికిత్సలు, స్పీచ్ థెరపీ అంతా వ్యర్థమయ్యాయి. కాని టీచర్ కొట్టిన చెంప దెబ్బ అనుకోకుండా అతనికి మేలు చేసిందన్నమాట!
News Posted: 28 October, 2009
|