స్పెక్ట్రమ్ మహా కుట్ర న్యూఢిల్లీ : బుకాయించినా కుట్రను దాచలేరేమో. ఇప్పుడు ఆ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రి ఎ రాజా. ప్రైవేట్ ఆపరేటర్లకు చేసిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులన్నీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) రూపొందించిన మార్గదర్శక సూత్రాలుకు అనుగుణంగా చేసినవేనని ఆయన చెప్పుకోవచ్చు. కానీ దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ మాత్రం స్పెక్ట్రం కుంభకోణంపై కేసు నమోదు చేసింది. దాని ప్రాధమిక పరిశోధన నివేదిక(ఎఫ్ ఐ ఆర్) లో స్పెక్ట్రం కేటాయింపుల్లో టెలికాం అధికారుల నేరపూరితమైన కుట్ర ఉందని ఆరోపించింది. టెలికమ్యూనికేషన్స్ విభాగంలోని అధికారులు కొందరు ఎంపిక చేసుకున్న ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా సర్వీసు లైసెన్సులు ఇవ్వడానికి తమకున్న అధికారాలను దుర్వినియోగం చేసారని పేర్కొన్నారు. నామమాత్రం రుసుముకు లైసెన్సులు ఇచ్చిన ఈ అధికారులు ఇతరుల దరఖాస్తులను ఎలాంటి సహేతుకమైన కారణం చూపకుండానే తిరస్కరించారని కూడా ఎఫ్ ఐ ఆర్ లో సిబిఐ అధికారులు ఆరోపించారు.
కానీ టెలికాం మంత్రి ఎ రాజా మాత్రం ఈ వివాదంలోకి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను కూడా లాగడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రధానిని సంప్రదించిన అనంతరం ఆయన అనుమతితోనే ప్రైవేట్ ఆపరేటర్లకు 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగాయని రాజా ప్రకటిస్తున్నారు. ట్రాయ్ సిఫార్సులకు అనుగుణంగా, ప్రధాని అనుమతి తీసుకుని, సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని మాత్రమే ఈ లైసెన్సులు మంజూరు చేశామని ఆయన మీడియాకు చెప్పారు. కానీ ఈ వివరణలు ఏమీ కూడా రాజాను రక్షించేటట్లు కనిపించడం లేదు. దాదాపు రెండేళ్ళ తరువాత బయటపడుతున్న వాస్తవాలు మాత్రం రాజా మెడకు చుట్టుకోవడం మాత్రం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
సిబిఐ మాత్రం కేసును బిగించే కట్టింది. భారతీయ శిక్షా స్మృతిలోని 120-బి సెక్షను, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షను 13(2), 13(1)(డి)ల కింద కేసులు నమోదు చేసింది. కొంతమంది పేర్లు తెలియని టెలికాం అధికారులను, పేర్లు తెలియని ప్రైవేట్ వ్యక్తులను, కంపెనీలను, ఇతరులను ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. సిబిఐ ఈ ఎఫ్ ఐ ఆర్ ను అక్టోబర్ 21 వ తేదీన నమోదు చేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలు, అవినీతి కారణంగా ప్రభుత్వానికి నష్టం జరిగిందని, ప్రైవేట్ ఆపరేటర్లకు తప్పుడు పద్ధతుల్లో లాభం చేకూరిందని ఆరోపించింది. ఈ వ్యవహారంలో దాదాపు 22 వేల కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు ఉన్నాయని అంచనా వేసింది.
టెలికాం అధికారులు నేరపూరితమైన కుట్రకు ఎలా పాల్పడ్డారో ఎఫ్ ఐ ఆర్ లో సిబిఐ వివరించింది. 2007 సెప్టెంబ్ 24 వ తేదీన టెలికాం అధికారులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అది మర్నాడు ప్రచురితమైంది. అక్టోబర్ ఒకటో తేదీ తరువాత లైసెన్సు కోసం వచ్చే ఎలాంటి దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ ఒకటో తేదీవరకూ తక్కువ గడువే ఉన్నప్పటికీ దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడ్డాయి. వీటిలో చాలా మంచి సామర్ధ్యం ఉన్న కంపెనీలు, అప్పటికే ఆ రంగంలో స్థిరపడిన కంపెనీల దరఖాస్తులు కూడా ఉన్నాయి. కానీ అధికారులు వీటిని పరిశీలనకు తీసుకోలేదు. సరికదా సెప్టెంబర్ 25న లేదా అంతకు ముందే వచ్చిన దరఖాస్తులను మాత్రమే 2008 జనవరి 10 వ తేదీన పరిశీలించారు. 122 సర్కళ్ళకు తొమ్మిది మందిని ఎంపిక చేసి వారికి కేటాయింపు లేఖలు పంపించారు. ఈ విధంగా గడువులోగా వచ్చినా, కనీసం సెప్టెంబర్ 26 వ తేదీన వచ్చిన దరఖాస్తులను కూడా అధికారులు బుట్ట దాఖలు చేయడం వెనుక కుట్ర ఉందని సిబిఐ పేర్కొంది.
News Posted: 28 October, 2009
|