'నాజూకు' నూడుల్స్ మలేసియా : సన్నజాజి తీగలా నాజూగ్గా, మెరుపుతీగలా మిసమిసలాడుతూ ఉండాలని భావించే భామలకు శుభవార్త. బొండు మల్లె చెండులా బొద్దుగా అయిపోయి ఫిగరు పోయిందని ఫికరు పడిపోయే పడుచులకు ఇది రుచికరమైన వార్త. బరువును తగ్గించే నూడుల్స్ అతి త్వరలో ప్రపంచ మార్కెట్ ను ముంచెత్తబోతున్నాయి. ఈ నూడుల్స్ తింటే కడుపు నిండినట్టు ఉంటుంది... అలానే శరీర బరువూ తగ్గుతుందని మలేసియా పరిశోధకులు హమీ ఇస్తున్నారు. మలేసియా సెయిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆహార పరిశోధకులు పొడిగా ఉండే పసుపు రంగు కొత్తరకం నూడుల్స్ ను తయారు చేశారు.
ఈ నూడుల్స్ ను వైద్యపరంగా పరీక్షించామని, మలేసియాలో ఇలాంటి నూడుల్స్ తయారు చేయడం ఇదే ప్రథమమని విశ్వవిద్యాలయం ముఖ్య పరిశోధకుడు, అసోసియేట్ ప్రోఫెసర్ అజర్ మాట్ ఈసా చెప్పారు. ఇప్పుడు మార్కెట్ లో దొరికే నూడుల్స్ కన్నా ఇవి చక్కెరను ఆలస్యంగా రక్తంలోకి విడుదల చేస్తాయని ఆయన వివరించారు. అధిక బరువుతో బాధ పడే వారికి ఇవి చాలా ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. పిండి పదార్ధాలు రక్తంలో కలవకుండా నిరోధించే ప్రోటీన్లతో వీటిని రూపొందించామని, అలానే పిండిపదార్ధాలు అరగకుండా కూడా చేస్తాయని ఆయన తెలిపారు. పిండి పదార్ధాలు అరగకుండా ఉండటం వలన కడుపు చాలా సేపు నిండుగా ఉండి త్వరగా ఆకలి వేయదని ఆయన వివరించారు. ఈ నూడుల్స్ ను ఉదయం తింటే ఇక రాత్రి వరకూ ఆకలి బాధ ఉండదని ఆయన చెప్పారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ నూడుల్స్ మార్కెట్ లోకి వస్తాయని చెప్పారు. రుచి విషయంలో సాధారణ నూడుల్స్ నే పోలి ఉంటాయని, వీటిని ఎలాగైనా వండుకోవచ్చని ఆయన తెలిపారు.
News Posted: 30 October, 2009
|