టాయిలెట్లు ఫర్వాలేదు! వార్సా : 2012లో యూరో సాకర్ చాంపియన్ షిప్స్ నిర్వహణకు తమ దేశం టాయిలెట్ సౌకర్యాలతో సహా సిద్ధంగా ఉన్నదా అనే తేల్చుకునేందుకు ఇద్దరు పరిశీలకులు ఒంటిని పూర్తిగా కప్పి ఉండే తెల్లని ఓవరాల్స్ ను ధరించి పోలెండ్ దేశవ్యాప్తంగా టాయిలెట్లలోకి ధైర్యంగా వెళ్ళి వస్తున్నారు. చాలా వరకు టాయిలెట్లు ఫర్వాలేదని వారు సర్టిఫికెట్ ఇస్తున్నారు. కాని, మిగిలినవి, ముఖ్యంగా 1989 కమ్యూనిస్ట్ ల హయాంకు ముందు నుంచి ఉన్నవి మాత్రం సరైన స్థితిలో లేవని వారు అంటున్నారు.
టాయిలెట్ సామగ్రిని ఉత్పత్తి చేసే ఒక సంస్థ నిర్వహిస్తున్న 'టోలెటా2012.పిఎల్' ప్రాజెక్ట్ లో భాగంగా ఈ పరిశీలన జరుగుతోంది. ఈ పరిశీలక బృందంలో చేరేందుకు దేశంలో సాధారణ పౌరులను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. యూరోపియన్ సాకర్ చాంపియన్ షిప్స్ కోసం వేలాది మంది అభిమానులు ఆతిధేయ దేశాలు పోలెండ్, యుక్రెయిన్ లకు 2012లో రానున్న దృష్ట్యా ఈ ప్రాజెక్టును చేపట్టారు.
ఈ గస్తీ బృందాలు ఇప్పటి వరకు పోలెండ్ లో ఆరు పెద్ద నగరాలలో 200 టాయిలెట్లను సందర్శించి, విదేశీ టూరిస్టులపై సర్వే నిర్వహించారు. హోటళ్ళు, విమానాశ్రయాలలోని టాయిలెట్లు బాగానే ఉన్నాయి కాని రైల్వే, బస్ స్టేషన్లలోవి మాత్రం ప్రమాణాల పరంగా వెనుకబడి ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. కాగా, 'జైనిక్ గెజెటా ప్రావ్నా' దినపత్రిక ఈ విషయమై వ్యంగ్యోక్తి విసిరింది. పోలెండ్ సాకర్ క్రీడాకారుల కన్నా ఈ చాంపియన్ షిప్ కోసం దేశంలోని టాయిలెట్లే మెరుగైన స్థితిలో ఉన్నాయని పత్రిక వ్యాఖ్యానించింది. దక్షిణాఫ్రికాలో 2010లో జరిగే ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంట్ కు పోలెండ్ అర్హత సాధించలేకపోయింది.
News Posted: 30 October, 2009
|