టీచర్లపై విద్యార్ధుల నిఘా జలంధర్ : పాఠశాలల్లో క్లాస్ లీడరు, స్కూల్ ప్యూపుల్ లీడరు ఉంటారు. విద్యార్ధులకు ప్రతినిధులన్నమాట. ఉదయం ప్రార్ధనలు నిర్వహించడం, పాఠశాలలో సౌకర్యాలను గురించి అడగటం, టీచర్ లేనప్పుడు తరగతి గదిలో పిల్లలు అల్లరి చేయకుండా చూడటం, హెడ్మాస్టరు ఆదేశాలను పిల్లలందరికీ చేరవేయడం తదితర బాధ్యతలన్నీ ఈ లీడర్లు మోసేవారు. కానీ పంజాబ్ ప్రభుత్వం క్లాస్ లీడర్లను వినూత్నంగా వినియోగించుకుంటోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 30 వేల మంది విద్యార్ధులను ఎంపిక చేసి వారికి క్లాస్ మానిటర్ బాధ్యతలను అప్పగించింది. వీరు పిల్లల మీద అజమాయిషీ చేయరు. వారి పని ఉపాధ్యాయుల మీద నిఘా పెట్టడం. టీచర్లపై అజమాయిషీ చేయడం. ప్రతీ రోజూ తరగతి గదిలో ఉపాధ్యాయుల పని తీరును ఎప్పటికప్పుడు డైరీలో నమోదు చేసి అధికారులకు సమర్పించడం. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం బాగా పెరుగుతుందని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వం ఇటీవలే ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని పాఠశాల విద్యా విభాగం డైరెక్టర్ జనరల్ కిషన్ కుమార్ చెప్పారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఈ 'మానిటర్ డైరీ' పద్ధతిని అమలు చేస్తున్నామని చెప్పారు. తరగతి గదిలో టీచరు ఆ రోజు బోధించిన పాఠ్యాంశం వివరాలు, హోం వర్కు ఇచ్చిన వివరాలు సబ్జెక్టుల వారీగా క్లాస్ మానిటర్లు డైరీలో పొందుపర్చుతారని వివరించారు. ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఆరు వేల పాఠశాలల్లో క్లాస్ మానిటర్లు టీచర్ల పనితీరును పరిశీలించి డైరీలో రాస్తున్నారన్నారు. పని చేయని ఉపాధ్యాయులకు ఈ డైరీ సరైన మందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివలన కనీసం 13 లక్షల మంది విద్యార్ధులు ప్రయోజనం పొందుతున్నారని వెల్లడించారు.
క్లాస్ మానిటర్లు ఇచ్చే డైరీ నివేదికే కాకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ప్రతీ రోజూ ఉపాధ్యాయుల పని తీరును పరిశీలించి అదే డైరీలో తమ వ్యాఖ్యలను రాయాల్సిందిగా ఆదేశించామన్నారు. ఒకవేళ టీచర్ హజరుకాకపోతే డైరీలో ఆ గడులను ఖాళీగా వదిలివేస్తారని, కాబట్టి చెప్పాపెట్టకుండా బడులు ఎగ్గొట్టే టీచర్లకు కష్టాలు తప్పవని ఆయన అన్నారు. ప్రతీ రోజు సిలబస్ ప్రకారం కొత్త పాఠం చెప్పాల్సి ఉంటుందని కబుర్లతో కాలక్షేపం చేయడానికి కుదరదని ఆయన తెలిపారు. టీచర్లు కూడా ప్రతీ రోజు తాము ఏ తరగతిలో ఏయే పాఠాలు బోధించామో వివరిస్తూ ఒక డైరీ రాయాల్సి ఉంటుందని, క్లాస్ మానిటర్లు ఇచ్చే డైరీ వివరాలతో వీటిని సరిపోల్చుతామని ఆయన చెప్పారు.
News Posted: 30 October, 2009
|