జైపాల్ కన్ను పడింది హైదరాబాద్ : అసలు సిసలైన రాజకీయ అధికార లాలస క్రీడ ఇప్పుడు మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో తలలు పండిన నాయకులు ప్రయోగించే చాణక్య తంత్రాల రుచిని రాజకీయాలకు కొత్తైన పిల్ల(జూనియర్లు)లు చూడబోతున్నారు. ముఖ్యమంత్రి కావాలంటే సంఖ్యాబలం ఒక్కటే సరిపోదని, గడులు నప్పించే చదరంగపుటెత్తులు కావాలని, నెత్తురు బొట్టు చిమ్మకుండా కుత్తుకలు కోసే కుయుక్తులు నేర్చుకోవాలని, చేతికి మట్టి అంటకుండా అలవోకగా సమాధులు కట్టే సమయస్ఫూర్తి కావాలని చెప్పే అంకానికి తెర లేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం ఆయన తనయుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని వీరవిధేయవర్గం వీరంగం తొక్కింది. అధిష్టానం రోశయ్యను పీఠం ఎక్కించింది. కానీ రోశయ్యకు అనూహ్యమైన శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.
ఢిల్లీలో కూర్చుని తెరమీదకు వచ్చిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఈ పరిణామాలను గమనించి లోపాయికారీగా రోశయ్యకు మద్దతు ఇచ్చి తాను రేసులో లేనని బహిరంగ ప్రకటన చేశారు. ఇప్పుడు జగన్ కాదని తేలిపోయిన తరువాత, ఆ ప్రమాదం తప్పిన తరువాత మళ్లీ ఇప్పుడు జైపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారన్నది ఢిల్లీ రాజకీయ వర్గాల తాజా కథనం. అధిష్టానంలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని, రెడ్డి కార్డును అడ్డం పెట్టుకుని జైపాల్ చాలా వేగంగా పావులు కదుపుతున్నారన్నది విశ్వసనీయవర్గాల సమాచారం. తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగకుండా గతంలో రోశయ్యకు మద్దతు ఇచ్చిన ఎఐసీసీ నాయకుని ద్వారా మంత్రాంగం నిర్వహిస్తున్నారని తెలిసింది. దీనిలో మరో ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానకి జైపాల్ రెడ్డి వైఎస్ వర్గాన్నే వినియోగించుకోడానికి వ్యూహాన్ని రచించడం. జగన్ కాకపోతే ఎవరైనా తమకొకటే అన్న ధోరణిలో ఉన్న వైఎస్ వర్గాన్ని ఆ ఎవరో 'రెడ్డి' అయితే మేలు కదా? అన్న సంకేతాలను జైపాల్ పంపించారని వినికిడి.
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత చాలా వేగంగా వేగుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్న రోశయ్యకు దేశ రాజధానిలో జరుగుతున్న నాటకం గురించి ఇప్పటికే తెలిసిందని వివరిస్తున్నారు. రోశయ్య పనితీరు నచ్చని రాష్ట్ర మంత్రులను గుర్తించి వారితో జైపాల్ మంతనాలు జరుపుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర నాయకుడు ఒకరు అక్కడికి ముఖ్యమైన రాష్ట్ర మంత్రిని హుటాహుటీన పిలిపించుకోడానికి కూడా జైపాల్ కారణమని తెలిసింది. తన 'వర్గం' ఎమ్మెల్యేలతో ఇప్పటికే జైపాల్ పలుమార్లు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. తాను రంగంలో కనిపించకుండా ఈ బృందంతోనే తన అభ్యర్ధిత్వాన్ని అధిష్టానం దగ్గర బలపరచాలన్నది జైపాల్ వ్యూహమని వివరిస్తున్నారు. ఏది ఏమైనా అతి త్వరలోనే ఈ కొత్త నాటకానికి తెర లేస్తుందని విశ్వసనీయ వర్గాలు కథనం.
News Posted: 31 October, 2009
|