'చేయి' కలిపిన చిరు హైదరబాద్ : అనుకున్నట్లే అవుతుంది. ఊహించిందే జరుగుతోంది. ఉనికి కోసం వెంపర్లాడుతున్న ప్రజారాజ్యం పార్టీ చివరకు కాంగ్రెస్ తోనే దోస్తీ చేయడానకి సిద్ధపడిపోయింది. అసలు ఈ పరిణామం ఎన్నికల అనంతరమే చోటు చేసుకోవాల్సి ఉంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే ఈ మిలాఖత్ ఇంకా తొందరగానే జరిగి ఉండేది. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా కాదని చెప్పినా అల్లు అరవింద్ రూపొందించన డిజైన్ ప్రకారమే ప్రజారాజ్యం పార్టీ నడుస్తోంది. ఎన్నికల్లో ఆశలు నిలవునా కూలిపోవడంతో పార్టీ ఛిన్నాభిన్నం అయిపోయింది. ఎలా వచ్చిన వాళ్ళు అలానే తట్టా బుట్టా సర్దుకుని వెళ్ళపోయారు. ఒక దశలో ఎమ్మెల్యేలను కాపాడు కోవడమే చిరంజీవికి గగనమైపోయింది. ప్రజారాజ్యం కాంగ్రెస్ తో కలవడం ఖాయమని, ఇంకా ముందుకెళితే విలీనం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ పార్టీ నాయకత్వ పోకడలను సన్నిహితంగా గమనించిన వారు ఎప్పుడో అంచనా వేశారు. దానికి ముహూర్తం ఇప్పుడు కుదిరింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పుణ్యమాని ప్రజారాజ్యం ఇంతకాలం వేసుకున్న భ్రమల ముసుగులను తొలగించి నిజరూపాన్ని ప్రదర్శించింది.
గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు కోసం ప్రజారాజ్యం నాయకులును శనివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఆహ్వానించారు. కానీ దీనికి ముందు ప్రజారాజ్యం చాలా డ్రామా నడిపింది. పరామర్శ పేరుతో ఎమ్మెల్యేలను జగన్ వద్దకు పంపించింది. అనేక సందర్బాలలో రోశయ్యకు అనుకూలంగా చిరంజీవి ప్రకటనలు సైతం చేశారు. ఆహ్వానం అందుకున్నదే తడవుగా చిరంజీవి బావమరిది అరవింద్ రంగంలోకి దిగిపోయారు. ఒక హోటల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ను కలిసి ఎన్నికల పొత్తులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. హోటల్ నుంచే అరవింద్ ఎప్పటికప్పుడు ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవితో మంతనాలు నడిపించారు. వీరి భేటీ ముగిసిన తరువాత చిరంజీవి డి శ్రీనివాస్ తో మాట్లాడినట్లు తెలిసింది.
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పీఆర్పీ పొత్తు పెట్టుకుంటే 25 వార్డులు కేటాయిస్తామని, ఈ స్థానాల్లోప్రజారాజ్యం అభ్యర్థులను గెలిపిస్తామని డిఎస్ హమీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రజారాజ్యం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో 50 వార్డులు తమకు కేటాయించాలని, ఈమేరకు తమకు అంగీకారం కుదిరితే పార్టీ నాయకుడుతో చర్చించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని అరవింద్, డిఎస్‌కు తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రజా రాజ్యం పార్టీ గ్రేటర్ పరిధిలో సరైన అభ్యర్థులు దొరక్క తీవ్ర ఇబ్బందులను పడుతున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకూడదని రాజ్యం అగ్ర నాయకులు భావిస్తున్నారు.
News Posted: 31 October, 2009
|