'అభిమన్యు'లను కనొచ్చు! అహ్మదాబాద్ : మీకు పుట్టబోయే బిడ్డ అభిమన్యునిలా ఏకసంథాగ్రాహి, మేథావి కావాలా? 'సూపర్ కిడ్' వద్దనకునే వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. అదిగో అలాంటి వారి ఆశలను నెరవేర్చడానికి ఒక 'మహర్షి' సిద్ధంగా ఉన్నారు. గర్భం దాల్చిన మొదటి రోజు నుంచే అమ్మ కడుపులో ఉన్న శిశువుకు విద్యాభ్యాసం చేయడం ద్వారా తెలివైన పిల్లలకు జన్మనీయవచ్చని ఈయన సిద్ధాంతం. దీనిపై శాస్త్రవేత్తలు రాద్ధాంతం చేస్తున్నప్పటికీ మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన పద్మవ్యూహ రహస్యాలను రుక్మిణీదేవి గర్భంలో ఉన్న అభిమన్యుడు నేర్చుకున్నాడన్నకథనాన్ని ఈ మహర్షి స్ఫూర్తిగా తీసుకున్నాడు. గతంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన మహర్షి ప్రహ్లద్ పటేల్(67) ఈ టెక్నిక్ తో ';అద్భుత చిన్నారు'లను సృష్టిస్తానని హమీ ఇస్తున్నాడు.
ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైందని సామాజికవేత్త గౌరంగ్ జానీ అంటున్నారు. ఎందుకంటే ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లోని దంపతుల ఆలోచనలను ఇది పక్కదోవ పట్టిస్తుందని, తక్కువ ప్రతిభ ఉన్నవాళ్లకు పుట్టే హక్కులేదనే భావనను పెంపొందిస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. కానీ పటేల్ ఇవేమీ పట్టించుకోవడం లేదు. పెళ్ళయిన దంపతులు తమ పేర్లను తాను స్థాపించిన సూపర్ ఛైల్డ్ యూనివర్సిటీలో నమోదు చేయించుకోవాలని చెబుతున్నాడు. గాంధీనగర్ లోని అమర్ నాథ్ ధాం ప్రాంతంలో వెలసిన ఈ విశ్వవిద్యాలయానికి ఎలాంటి గుర్తింపూ లేదు. నూతన దంపతులు ఈ విశ్వవిద్యాలయంలో ఉండి కొన్ని యోగా ప్రక్రియలను నేర్చుకోవాలి. గర్భిణిగా తల్లి ఎలాంటి ఆలోచనలు చేస్తుంది, ఏమి చదువుతుందో గర్భస్థ శిశువు నేర్చుకుని సూపర్ ఛైల్డ్ గా జన్మిస్తుందని మహర్షి చెబుతున్నాడు.
ఈ విశ్వవిద్యాలయంలో చేరిన టివి నటి ఒకరు సూపర్ ఛైల్డ్ కోసం వెంపర్లాడుతోంది. తానకు జన్మించబోయే బిడ్డను నట-గాయకునిగా తీర్చిదిద్దాలని తన ఆలోచనని ఆమె వివరిస్తోంది. మానసిక, భౌతిక అంశాలలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారని, మొత్తం వారం రోజులకు కేవలం ఐదువేల రూపాయలను ఫీజుగా చెల్లించామని ఆమె తెలిపింది.
News Posted: 3 November, 2009
|