జైలును ప్రారంభించిన ఖైదీ గౌహతి : కొత్తగా సినిమాహాలు కట్టారనుకొండి. రిలీజ్ సినిమా హీరో లేదా హీరో అభిమాన సంఘం అధ్యక్షుడో, లేదా మరో కోటీశ్వరుడో దానిని ప్రారంభించడం రివాజు. కొత్తగా వ్యాపారం మొదలు పెడితే లక్కీ హేండ్ గా పేరు తెచ్చుకుని బోణీ కొట్టిస్తారు. మన దేశంలో మరి జైళ్ళు కడితే సర్వసాధారణగా రాజకీయనాయకులు వాటిని ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది. అదీ ఒకవిధంగా సరైందేనని ఎవరైనా భావిస్తూ ఉండొచ్చుకూడా. కానీ అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ నాయకులకు ఆత్మజ్ఞానం చాలా ఎక్కువలా ఉంది. అందుకే జైలును ప్రారంభిచండానికి ఎవరూ ముందుకురాలేదు. చివరాకరుకు జైలు అధికారులు సంవత్సరాల తరబడి బుర్రబద్దలు కొట్టుకుని, నెత్తి మీద నుంచి టోపీ తీసేసి ఆలోచించారు. ఎవరితో దానిని ప్రారంభోత్సం చేయించాలో తెలిసిపోయింది. అలా ఆవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో కట్టిన తొలి జైలును మంగళవారం నాడు మజ్ బూర్ రెహ్మన్ చేత రిబ్బన్ కత్తిరింపచేసి అతన్నే ఆ జైల్లోకి తోసేశారు. కొత్త సినిమా హాలుకు మొదటి ప్రేక్షకుడిలా, కొత్త షాపునకు మొదటి కస్టమర్ లా , కొత్త జైలుకు మొదటి ఖైదీ రెహ్మానే. ఎందుకంటే రెహ్మాన్ మరి హత్యానేరంలో అరెస్టయి విచారణలో ఉన్న ఖైదీ .
అరుణాచల్ ప్రదేశ్ లో ఖైదీలను చాలా దారుణమైన అనారోగ్య వాతావరణంలో ఉంచుతున్నారని, పోలీస్ స్టేషన్ల లాకప్ సెల్ లోనే సంవత్సరాల తరబడి కుక్కుతున్నారని, చిన్న సెల్ లో వందల మందిని పెడుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆందోళన చేయడంతో పదేళ్ల క్రితం జైళ్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జైళ్లు కట్టుకోడానికి నిధులిమ్మని అడిగితే రాష్ట్రంలో రెండు జైళ్ళు, ఏడు సబ్ జైళ్ళు కట్టుకోడానికి పది కోట్ల రూపాయలను కేటాయించింది. దానిలో భాగంగానే రాష్ట్రరాజధాని ఇట్నాగర్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో జుల్లీ బస్తీలో జిల్లా జైలును ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిని కట్టి అప్పుడే ఐదేళ్ళు దాటిపోయింది.
రాష్ట్రంలో నిర్మాణం ముందుగా పూర్తి చేసిన తొలి జైలును ఢిల్లీ ప్రముఖలతో ప్రారంభోత్సం చేయించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఐదేళ్లు గడిచిపోయినా విఐపీలు ఎవరూ రాలేదు. ఈలోగా ఈ జైలు దోపిడీలకు గురైంది. తలుపులు, ద్వారబందాలు, కిటీకీలు ఆఖరికి ఎలక్టికల్ స్విచ్ లను కూడా దొంగలు ఎత్తుకుపోయారు. మరి లాభం లేదని భావించిన అధికారులు 20 లక్షల రూపాయలతో దానికి మరమ్మతులు చేయించి ఎట్టకేలకు మంగళవారం ప్రారంభోత్సం చేయించారు. దీనిలో 50 బ్లాకులు ఉన్నాయని, వాటిలో పది బ్లాకులు ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించామని జైలు అధికారి మిచి పాకు చెప్పారు.
News Posted: 3 November, 2009
|