ఒబామా బెంగళూరు 'పాఠం' వాషింగ్టన్ : భారతదేశంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎల్ కేజీ నుంచే అమెరికాలో చదివించాలని తెగ ఆరాటపడుతుంటే... అక్కడి విద్యా ప్రమాణాలపై అధ్యక్షుడు బరాక్ ఒబామా అసంతృప్తిగా ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణాసియా దేశాలు... ముఖ్యంగా బెంగళూరు (భారత్), బీజింగ్ (చైనా) విద్యార్ధులతో పోటీపడాలని పిలుపునిచ్చారు. అనేక ఆవిష్కరణలకు నాయకత్వం వహించిన అమెరికా, ప్రస్తుతం గణితం, సైన్స్ లో వెనుకబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేందుకు 435 కోట్ల డాలర్లతో 'రేస్ టు ది టాప్' పథకం కింద కేంద్రం నిధులను ఒబామా మంజూరు చేశారు. విస్కాన్సిస్ రాష్ట్రంలో మాడిసన్ లో ఒబామా మాట్లాడుతూ ప్రస్తుతం నిధులను రాష్ట్రాలకు కేటాయిస్తున్నామని, అమెరికా విద్యార్థులను విద్యావంతులను చేయడంలో వాస్తవిక మార్పు రావాలని ఆకాంక్షించారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా తయారయ్యేలా రాష్ట్రాలు తమ పాఠశాలల్లోని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. 'వీరంతా కూడా అంతర్జాతీయ వాతావరణంలో పోటీ పడాల్సి ఉంటుంది. షికాగో, లాస్ ఏంజెలిస్ లో ( ఉద్యోగార్థులతో ) కాకుండా బెంగళూరు, బీజింగ్, విద్యార్థుతలతో పోటీపడాలి' అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో ప్రమాణాల పెంపునకు రాష్ట్రాలు విధానాలు రూపొందించాం. వాటి అమలును ఫెడరల్ అధికారులు తనిఖీ చేస్తారు. పాఠశాలల్లో విద్యావిధానాన్ని సమూలంగా మార్చాలని, నూతన బోధనారీతులు ప్రవేశపెట్టాలని ఒబామా పేర్కొన్నారు. బెంగళూరు గురించి ఒబామా ప్రస్తావించడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి.
News Posted: 5 November, 2009
|