రోశయ్య 'పట్టు'తిప్పలు న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రోశయ్య బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి చేస్తున్న ఢిల్లీ పర్యటన పట్ల కాంగ్రెస్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో వరదలు, సహాయక చర్యల అమలు కారణంగా ఢిల్లీకి రాలేకపోయిన ఆయన ఈ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాందీతో మర్యాద పూర్వకంగా భేటీ అవుతారనికాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ, అధిష్టానం కచ్చితమైన అజెండాలోనే ఢిల్లీకి రమ్మని రోశయ్యను ఆదేశించిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సోనియా, ప్రధాని మన్మోహన్ లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించినందుకు సోనియాను రోశయ్య అభినందిస్తారని చెబుతున్నారు.
పనిలో పనిగా రాష్ట్రంలో తన పట్టు బిగించేందుకు అవసరమైన నిర్ణయాలకు అధిష్టానం అనుమతిని రోశయ్య కోరే వీలుంది. అజెండాతో తాను రాలేదని రోశయ్య చెబుతున్నప్పటికీ, ఆయన ఆలోచనలను విన్న తరువాతనే... అధిష్టానం అజెండాను, దిశానిర్ధేశాన్ని చేస్తుందని తెలుస్తోంది. శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో భేటీ సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ, మార్పులు - చేర్పులు, ఇతర నియామకాలు, కొంతమంది నాయకుల బహిరంగ వ్యాఖ్యలు ప్రస్తావనకు రానున్నాయని భోగట్టా! మరోవైపు 'గ్రేటర్' కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయడం తద్వారా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యత సీఎం రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డీఎస్ లదే నన్న విధంగా పరిస్థితులు మారాయి. ఈ సమయంలో కొంతమంది గ్రేటర్ లో టికెట్ ల కేటాయింపు గురించి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ యాత్ర చేస్తున్న విషయం కూడా అధిష్టానం దృష్టికి వస్తాయని అంటున్నారు.
ఢిల్లీయాత్ర సందర్భంగా కొంతమంది విలేకర్లు జగన్ వ్యవహారాన్ని ప్రస్తావించగా, వైఎస్ అనంతరం సీఎం పదవికి ఆయన తనయుడు జగన్ స్వీకరించాలని చాలామంది అభిప్రాయపడ్డారని రోశయ్య పేర్కొన్నారు. అందుకు జగన్ ఉత్సాహం చూపారని, అదేం నేరం కాదని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపణలను ప్రస్తావించగా, మీడియా ద్వారా జవాబులు ఇవ్వనని రోశయ్య చెప్పడం విశేషం. ఇటువంటి వాటికి బహిరంగంగా జవాబు చెప్పే అలవాటు తనకు లేదని రోశయ్య చెప్పినప్పటికీ... ఇకపై ఇటువంటి వాతావరణం లేకుండా తన వంతు ప్రయత్నం ఢిల్లీలో చేస్తారని పరిశీలకుల అంచనా.
'రోశయ్యా!' దిగిపో! అని అధిష్టానం ఆదేశిస్తే... అరసెకండు కూడా ఆలస్యం చేయకుండా పదవి నుండి తప్పుకుంటానని ముఖ్యమంత్రి రోశయ్య మరోసారి ఉద్ఘాటించారు. అయితే, అధిష్టానం ప్రస్తుతానికి రోశయ్యను తప్పించే వాతావరణం ఢిల్లీలో కనిపించడం లేదు! శుక్రవారం ఢిల్లీ వచ్చిన రోశయ్య తొలుత విమానాశ్రయంలో విలేఖరులుతో మాట్లాడిన అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి వీరప్ప మొయిలీతో అరగంట సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చర్చించారు. శనివారం ఆయన హోం మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఆంటోనీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అవుతారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తో కూడా రోశయ్య భేటీ అయ్యే అవకాశం ఉంది. శనివారం సాయంత్రానికి రోశయ్య తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని భావిస్తున్నారు.
అధిష్టానం ఆశీస్సులను పూర్తిగా అందుకొని స్పష్టమైన అజెండాతో తిరిగి వచ్చే రోశయ్య... రాజకీయాల్లో తాను 'మెత్తిని కత్తి' వంటివాడినని నిరూపించుకునే అవకాశం ఉంది. ఇకపై అసమ్మతులు, నిరసన గళాలపై కొరడా ఝళిపించేందుకు ముఖ్యమంత్రి రోశయ్య వెనుకాడరని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
News Posted: 6 November, 2009
|