రైల్వేలో మహిళా పోర్టర్లు న్యూఢిల్లీ : మహిళాలోకం మరో విజయం సాధించింది. పురుషులకే పరిమితమైన రైల్వే కూలీ (పోర్టర్) పనిని వారు సాధించుకుంటున్నారు. విస్తృతంగా చర్చించిన తరువాత పోర్టర్ మరణించిన పక్షంలో లేదా అనారోగ్యానికి గురైన పక్షంలో... ఆ లైసెన్స్ ను అతని భార్య లేదా కుమార్తె లేదా దత్త పుత్రికకు ఇచ్చేందుకు భారతీయ రైల్వే అధికారులు సమ్మతించారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అలహాబాద్ లో ప్రవేశపెట్టినట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు.
గతంలో పోర్టర్ తన లైసెన్స్ ను కుమారుడు, దత్త పుత్రుడు లేదా సోదరుని పుత్రుడు, లేదా బావమరిదికి బదలాయించేందుకు అవకాశం ఉంది. ఈ అవకాశం భార్యలకు లేకపోవడం పట్ల మహిళా సంఘాలు కన్నెర్ర చేశాయి. దరిమిలా వచ్చిన కొత్త ఆదేశం వల్ల పోర్టర్ తన లైసెన్స్ ను కుమారునితో పాటు భార్య, కుమార్తెలకు కూడ బదిలీ చేయవచ్చు. దీనివల్ల అనేక పెద్ద రైల్వే స్టేషన్లలో రైల్వే పోర్టర్ బ్యాడ్జీల విక్రయాలకు తెరపడే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. న్యూఢిల్లీ వంటి స్టేషన్లలో రైల్వే పోర్టర్ బ్యాడ్జి 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ధర పలుకుతుంది.
ఇప్పటి వరకు మహిళా కూలీల నియామకానికి ఆంక్షలు లేనప్పటికీ... దేశంలో మహిళా కూలీలు పెద్దగా లేరు. పోర్టర్ లైసెన్స్ పరీక్షకు హాజరయ్యే గర్భిణులకు మార్గదర్శకాలను కూడా రైల్వేశాఖ జారీ చేసింది. ప్రభుత్వ వైద్యుడు సూచించిన కాలం వరకే బరువును మోసేందుకు గర్భిణీ పోర్టర్లను అనుమతిస్తారు. ఇదిలా ఉండగా, రైల్వే బోగీల్లో పొగతాగడాన్ని అరికట్టేందుకు 'టీటీఈ'లను నియమిస్తున్నట్లు చెప్పారు. రైల్వే బాత్ రూమ్ ల్లో వాకిళ్ళ దగ్గర పొగ పీల్చేవారిని వదిలేది లేదంటూ, అటువంటివారిని పట్టుకొని జరిమాన విధిస్తామని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రక్రియలో రైల్వే రక్షణ దళం కూడా జోక్యం చేసుకుంటుందని తెలిపారు.
News Posted: 7 November, 2009
|