స్కూళ్ళలో పొగాకు ఊసొద్దు భువనేశ్వర్ : పాఠశాలలో బాబునో, పాపనో దించేసి వద్దామని అనుకుంటున్నారా! జాగ్రత్త... మీ జేబులో సిగరెట్, గుట్కాలను జేబుల్లోంచి విసిరి పారేయండి! లేకపోతే... మీ జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలను పొగాకు రహిత ప్రాంతాలుగా ప్రకటించిన నోటిఫికేషన్ ఒరిస్సా విద్యామండలికి అందింది. ఈ మేరకు ఒరిస్సా ఆరోగ్య శాఖ మంత్రి ప్రసన్న ఆచార్య కూడా ధృవీకరించారు. పాఠశాలలకు 100 గజాల దూరంలో పొగాకు, పొగాకు ఉత్పత్తుల అమ్మకం, వినియోగాన్ని కేంద్రం నిషేధించిన క్రమంలో ఒరిస్సా ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. ఈ విషయమై పొగాకు వ్యతిరేక ఉద్యమ కార్యకర్త ఇతి శ్రీ కనుంగో మాట్లాడుతూ, విద్యార్థులతో సహా ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లితండ్రులు, సందర్శకులు నియమాలను పాటించాల్సిందేనని పేర్కొంటున్నారు. పాఠశాలలో సిబ్బంది పొగాకు వినియోగంతో విద్యార్థులు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు బాలికల్లో కూడా పొగాకు వినియోగం ప్రమాదకరస్థాయిలో ఉందని, నిషేధం వల్ల విద్యార్థులు, పొగాకు వైపు ఆకర్షణకు లోను కాకుండా నివారించవచ్చునని పేర్కొన్నారు.
ఇంతకీ... విద్యామండలికి అందిన ఆదేశం ప్రకారం... కళాశాల, పాఠశాలలను 'పొగాకు రహిత ప్రాంతాలు'గా ప్రకటిస్తూ ఆయా విద్యా సంస్థల్లో నోటీసులు అంటించాలి. పొగాకు చూపే ప్రభావాలపై కరపత్ర ప్రచారం, ఉపన్యాసాలు, సదస్సులు నిర్వహించాలి. అంతేకాకుండా ఆయా విద్యా సంస్థల్లో పొగాకు నిషేధం అమలు తీరు పర్యవేక్షించేందుకు ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ - ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీలు పనిచేస్తాయని ఆరోగ్యమంత్రి ప్రసన్న ఆచార్య తెలిపారు. ఈ నెల నుంచి పాఠశాలల్లో పొగాకు నిషేధం అమలులోకి వచ్చిందన్నారు. ప్రజల్లో అవగాహన లేకుండా ఎన్ని చట్టాలు చేసినా ఫలితం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
News Posted: 7 November, 2009
|