కాటేసిన పామును కరిచేశాడు భువనేశ్వర్ : కంటికి కన్నూ, కాటుకు కాటు. ఇదే నీతి.. న్యాయం. మనల్ని ఎవరైనా తిడితే తిరిగి తిడతా. కొడితే తిరిగి కొడతాం. కానీ ఆ యువకుడు మాత్రం కొంచెం భిన్నంగా కక్ష తీర్చుకున్నాడు. పాము అతనిని కాటేసింది. అంతే కోపంతో రెచ్చిపోయిన ఆయువకుడు తిరిగి పామును కరిచేశాడు. కరకర నమిలేశాడు. ఆనక ఆసుపత్రి పాలయ్యాడు.
ఇంతకీ కాటు కథ ఏమిటంటే భువనేశ్వర్ లోని బీడీఎ పార్క్ లో తోటమాలిగా పని చేస్తున్న రమేష్ జమ్దా ఉదయాన్నే గడ్డి కోసే యంత్రంతో పని చేస్తున్నాడు. ఉన్నట్లుండి... కాలి బొటనవేలు దగ్గర చురుక్కుమంది. ఏమిటా అని వంగి చూడగానే... చిన్న పామొకటి బొటనవేలిని కరిచింది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు కాలును పక్కకు లాగినా ఫలితం లేకపోయింది. దీంతో గడ్డి కోసే కత్తెరతో దాన్ని దూరంగా పడేశాడు. అప్పటికే లోపలకు కోరలు దిగబడడంతో నొప్పితో బాధపడుతున్న అతనికి కోపం నషాళానికి అంటింది. అంతే! పామును పట్టుకొని కరవడం మొదలు పెట్టాడు. అతని 'కాటాగ్రాహాని'కి పాము రెండు ముక్కైలైపోయింది. దానిని తోక వరకూ నమిలి మింగేసాడు. ఇంతలో కోపం తగ్గింది. తాను చేసిన పని తనకే రోత కలిగించింది. అసహ్యంతో వికారం తన్నుకొచ్చింది. చాలా వాంతులు చేసుకున్నాడు. కొన్ని నిమిషాల అనంతరం స్పృహ కోల్పోయిన అతన్ని తోటి ఉద్యానవన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. స్పృహ నుంచి కోలుకుంటున్న అతను మాట్లాడుతూ, 'నా కాలి బొటనవేలుని కరవడంతో కోపం వచ్చింది. మళ్ళీ కరచి పగతీర్చుకున్నాను' అని రమేష్ డాక్టర్లకు సెలవిస్తున్నాడు!
News Posted: 9 November, 2009
|