సోనియా న్యూటీం జాప్యం న్యూఢిల్లీ : అఖిల భారత కాంగ్రెస్ కమిటి పునర్వ్యవస్థీకరణ మరోసారి వాయిదా పడినట్లుగానే కనిపిస్తోంది. గత నెలలో మూడు రాష్ట్రాల ఎన్నికల అనంతరం రేపోమాపో మార్పుల ప్రకటన వెలువడుతుందని భావించినప్పటికీ, ఈ కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నూతన బృందం కొత్త సంవత్సరం ప్రారంభంలో సమకూరుతుందని భావిస్తున్నారు. ఈసారి ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణకు కారణం జార్ఖండ్ లో ఎన్నికలు, శీతాకాల పార్లమెంటు సమావేశమేనని చెబుతున్నారు. అయితే పితృపక్షం, సూర్యచంద్రుల గతుల ఆధారంగా కూడా నూతన ఏఐసీసీ టీమ్ ప్రకటనలో జాప్యానికి కారణమని అంతరంగిక వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి ఈ ఏఐసీసీ కమిటీ ప్రకటన మే నుంచి వాయిదా పడుతోంది. అనేక సందర్భాల్లో కమిటీని ప్రకటించడానికి సిద్ధమైన తరువాత చివరి నిమిషాల్లో వాయిదా పడింది. ఎక్కువ మంది నాయకులు సంక్రాంతిలోగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వ్యతిరేకం. అందువల్ల జనవరి 15 లోగా మార్పులు జరగే అవకాశం లేదు. ఏఐసీసీ ప్రకటన కన్నా ముందుగా రాజ్యసభకు నామినేట్ చేసే సభ్యులను ఎంపిక చేయడం, పలు రాష్ట్రాలకు గవర్నర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత ఏఐసీసీ గత పార్లమెంటు ఎన్నికల కోసం రూపొందించిన కారణంగా తాజాగా పునర్వ్యవస్థీకరించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సంకల్పించార. కమిటీలో కొత్త మొహాలకు స్థానం కల్పించి, భవిష్యత్ లో కీలక బాధ్యతలు అప్పగించాలన్నది పార్టీ వ్యూహం. అనేక మంది మంత్రులు తమను పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని అడిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ బృందం సారధ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
పార్ట్ టైమ్ గా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులు తమకు పార్టీ విధుల నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కేరళ రాజకీయాలకు తోడుగా మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖలను నిర్వహిస్తున్న పృధ్వీరాజ్ చవాన్ హర్యానా ఎన్నికల బాధ్యతను పర్యవేక్షించారు. అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్ చార్జిగా పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వి.నారాయణ స్వామి పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న మంత్రి గులామ్ నబీ అజాద్ ఒరిస్సా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రులు ముకుల్ వాస్నిక్, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జులుగా ఉన్నారు. ఈ మంత్రులు పార్టీ విధుల నుంచి తొలగితే, కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
News Posted: 9 November, 2009
|