సెల్ వాడితే జైలే! న్యూఢిల్లీ : వాహనాలను నడుపుతూ సెల్ ఫోను మాట్లాడే అలవాటు ఉన్నవారికి ఇదో మేలుకొలుపు కాల్. ఇలాంటి సెల్ బాబుల భరతం పట్టడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త నిబంధనను ప్రవేశపెట్టబోతోంది. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోనులో మాట్లాడుతూ దొరికిపోతే వారికి రెండు వేల రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించడానికి చట్టం తీసుకురాబోతోంది. ఒకవేళ సెల్ ఫోనులో మాట్లాడుతూ వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమైతే ఈ శిక్షలతో పాటు ఆరు నెలలు పాటు డ్రైవింగ్ లైసెన్సును సస్పెన్షన్ లో పెడతారు.
చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే కదా కనపడి పట్టుకునేది అని ధీమా పడకండి. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు బ్లూటూత్ లేదా ఇయర్ ఫోన్స్ ద్వారా మాట్లాడినా లేదా మెస్సేజ్ లు పంపించినా కూడా నేరంగానే పరిగణిస్తారు. ఇప్పటికే ఒక హై పవర్ కమిటీ రహదారులపై ప్రమాదకరమైన డ్రైవింగ్ ను నిరోధించడానికి ఈ సిఫార్సులను ఆమోదించిందని రవాణా శాఖ అధికారి తెలియచేశారు. భారీ జరిమానా, డ్రైవింగ్ లెసెన్సు రద్దు వంటి శిక్షలతో రూపొందిన ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, నోటిఫికేషన్ రూపంలో త్వరలోనే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఆయన వివరించారు. వీటిని కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన అధికారాలను ట్రాఫిక్ పోలీసులకు ఇస్తారని తెలిపారు.
మోటారు వాహనాల చట్టంలోని సబ్ సెక్షను 183ఎ గా దీనిని పొందుపర్చాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఈ సెక్షను మొబైల్ ఫోనుల వినియోగం- వాటికి వేసే శిక్షలను గురించి వివరిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఎకే దాస్ వివరించారు. బిజెపీ ఎంపీ వెంకయ్యనాయుడు అధ్యక్షతన, సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి నాయకత్వంలోని ట్రాన్స్ పోర్టు పార్లమెంటరీ కమిటీ దీనిపై కూలంకషంగా చర్చించి డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వినియోగించేవారికి జరిమానా, జైలు శిక్ష విధించాలని సలహాఇచ్చినట్లు వివరించారు. ఈ మేరకు కొత్త నిబంధనలు అమలు లోకి రానున్నాయి.
News Posted: 11 November, 2009
|