సముద్రాల పోరుతో కరవు న్యూఢిల్లీ : భారతదేశ ప్రజలపై విరుచుకుపడ్డ కరవు, ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసిన కరవు, మన రాష్ట్రాన్ని సైతం విలవిలలాడిస్తున్న కరవు ఎందుకొచ్చిందో, దానికి కారణాలేమిటో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దేశం చుట్టూ ఆవరించి ఉన్న మహా సముద్రంలోని రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న పోరాటమే తీవ్రమైన దుర్భిక్షానికి దారితీసిందని నిగ్గు తేల్చారు. దేశానికి తూర్పు వైపునకు విస్తరించిన బంగాళాఖాతం ప్రాంతం మిగతా హిందూ మహాసముద్ర ప్రాంతానికి నడుమ వాతావరణ యుద్ధం జరిగిందని, అందువల్లనే రుతుపవనాలు నాశనమై, మేఘాలు అదృశ్యమై 2009 అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఎప్పుడూ వెచ్చని ఉపరితల వాతావరణం ఉంటుంది. దానికంటే హిందూ మహా సముద్రం చల్లగా ఉంటుంది. దీనివలన మేఘాలు చక్కగా ఏర్పడి భారత భూభాగంలోకి ప్రవేశించి వర్షిస్తాయి. కానీ ఈసారి గత జూన్ నెలలో హిందూ మహా సముద్రం పై వాతావరణం బంగాళా ఖాతం కంటే వేడెక్కింది. దాంతో మేఘాల ఏర్పడే దశలోనే చచ్చిపోయాయి. దాంతో వర్షాభావం ఏర్పడి కరవు పిడుగు పడిందని వారు చెబుతున్నారు.
మూడు వారాల పాటు సాగిన ఈ యుద్ధం కారణంగానే జూన్ నెలలో వర్షాలు కురవలేదు. మిగతా కాలంలో కూడా ఈ లోటు పూడలేదు. దాంతో సాధారణం కంటే మొత్తం 23 శాతం తక్కువ వర్షపాతం నమోదై కరవు ఏర్పడింది. బంగాళాఖాతంపై ఉండే వేడి కారణంగానే వర్షాకాలంలో మేఘాలు స్థిరంగా ఉంటాయని నిపుణులు తెలిపారు. కానీ ఈ యేడాది బంగాళా ఖాతం కంటే భూమధ్యరేఖపై ఉన్న హిందూ మహాసముద్రంలో ఒక డ్రిగ్రీ వేడి అధికం కావడంతో మేఘాలను అది మింగేసిందని వివరించారు. బంగాళాఖాతంపై ఆధారపడే హిందూ మహాసముద్రంలో మేఘాలు ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు వస్తాయని, కానీ బంగాళాఖాతంలో ఏర్పడే మేఘాలను చంపేసే శక్తి హిందూ మహాసముద్రానికి ఉందని ఇండియన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు చెందిన వాతావరణం, సముద్ర శాస్త్ర విభాగం ప్రొఫెసర్ సులోచనా గాడ్గిల్ చెప్పారు. జూన్ నెలలో మూడు వారల సుదీర్ఘ కాలం పాటు హిందూ మహాసముద్రంలో వేడి వాతావరణం కొనసాగడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారని ఆమె వివరించారు.
గడచిన దశాబ్ధకాలంలో ఈయేడాది 23 శాతం వర్షపాతం తక్కువ కావడం తొలిసారని ఆమె తెలిపారు. 1974లో 24 శాతం, 2002లో 22 శాతం తక్కువ వర్షపాతాలు నమోదు అయ్యాయని, ఆయా సంవత్సరాల్లో కూడా దుర్భక్ష పరిస్థితులను దేశం చవిచూసిందని ఆమె చెప్పారు. అయితే ఇలాంటి పోరాటాలు ఈ రెండు సముద్రాల మధ్య తరచూ జరుగుతూ ఉంటాయని, అయితే ఎప్పుడూ బంగాళాఖాతమే విజయం సాధిస్తూ ఉంటుందని తెలిపారు. బంగాళాఖాతం చాలా త్వరగా కోలుకుంటుందని, తుపాను దెబ్బల నుంచి బంగాళాఖాతం 48 గంటల్లోనే కోలుకుని సాధారణ స్థితికి వచ్చేస్తూ ఉంటుందని ఆమె అన్నారు. కానీ దాదాపు పద్నాలుగేళ్ళ తరువాత ఈసారి మాత్రం బంగాళా ఖాతం ఓడిపోయిందని, గతంలో 1995లో మాత్రమే ఇలా జరిగిందని చెప్పారు.
News Posted: 12 November, 2009
|