'ఉల్లి మానండోయ్' సింగపూర్: ఈ వారం సింగపూర్ లో సమావేశం కానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇతర ఆసియా - పసిఫిక్ దేశాల నేతల కోసం వంటకాలు తయారు చేస్తున్న చెఫ్ లకు వెల్లుల్లి, ఉల్లి వాడకం తగ్గించవలసిందిగా సూచించారు. ఆ నేతలు చర్చలు సాగిస్తున్నప్పుడు వారి నోళ్ళలో నుంచి ఘాటైన వాసన రాకుండా ఉండేందుకు ఇలా చేయాలని చెఫ్ లకు సూచించారు.
సింగపూర్ లో 21 సభ్య దేశాల ఆసియా - పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ (అపెక్) సమావేశంలో పది వేల మంది ప్రతినిధులకు ఆహార పదార్థాలను సిద్ధం చేసే బాధ్యతను చేపట్టిన ఎగ్జిక్యూటివ్ చెఫ్ జెస్ ఓంగ్ గురువారం 'టుడే' దినపత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ, మసాలా చికెన్ సూప్, చిల్లీ క్రాబ్ వంటి స్థానిక వంటకాలతో తక్కువ ఘాటుతో ఆరోగ్యకరమైనదిగా మెనూ ఉంటుందని తెలియజేశారు.
ఈ ఆహార పదార్థాలలో ఉప్పు, చక్కెర కూడా తక్కువ ఉపయోగించనున్నట్లు ఓంగ్ తెలిపారు. పుదీనా కూడా ఉంటుందని ఓంగ్ తెలిపారు. ఓంగ్ మెనూలో ఎంతో రుచికరమైన రకరకాల సింగపూర్ వంటకాలు కూడా ఉంటాయి.
అపెక్ లోని సభ్య దేశాలు - ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, చైనా, హాంకాంగ్, ఇండోనీషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పపువా న్యూగినీ, పెరూ, ఫిలిప్పైన్స్, రష్యా, సింగపూర్, థాయిలాండ్, తైవాన్, యునైటెడ్ స్టేట్స్, వియత్నాం.
News Posted: 13 November, 2009
|