ఎగిరే వీడియో కెమెరా కోలార్ (కర్నాటక) : 2500 మీటర్ల ఎత్తులో ఎగురుతూ వీడియోలు తీసి, ప్రసారం చేయగల ఒక చిన్న మానవరహిత వాహనానికి కర్నాటకలోని ఒక మెకానికల్ ఇంజనీర్ రూపకల్పన చేశారు. డాక్టర్ టి. తిమ్మయ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ వినోద్ ఎస్. మూర్తి తమ కళాశాల ప్రాంగణంలో ఈ సాధనాన్ని గురువారం ప్రదర్శించారు. ఆయన పేరు మీద 'విన్స్ కాప్టర్'గా పేర్కొంటున్న ఈ సాధనం బ్యాటరీ సాయంతో 23 నిమిషాల సేపు ఎగరగలదు. దీనిని ఒక జాయ్ స్టిక్ ద్వారా నియంత్రించవచ్చు. దీని బరువు కొన్ని వందల గ్రాములు.
రక్షణ, మీడియా వంటి రంగాలలోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను ఈ సాధనం చక్కగా ఉపయోగపడుతుందని మూర్తి, ఆయన గురువు ఆర్థో డేవిస్ 'యుఎన్ఐ' ప్రతినిధితో చెప్పారు. దీనిని గూఢచర్యం కోసం కూడా ఉపయోగించుకోవచ్చునని వారు సూచించారు. దీనిని మరింత ప్రయోజనకరం చేసేందుకు జిపిఎస్, జిఎస్ఎం పద్ధతులను ఉపయోగించే అవకాశాలను తాము పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ ప్రదర్శనకు హాజరైన బెంగళూరు ఎన్ఎఎల్ ఎక్స్ పర్ట్ కన్సల్టెంట్ ఎస్. శంకరనారాయణ్ ఈ సాధనం నిర్దుష్ట పనితీరు పట్ల హర్షం వెలిబుచ్చారు. యుఎస్, జర్మనీలలో మాత్రమే తాను ఇటువంటి సాధనాలను చూసినట్లు ఆయన తెలిపారు. 'దేశీయ సాంకేతిక పరిజ్ఞానం'తో ఈ సాధనాన్ని రూపొందించడం అద్భుతమని శంకరనారాయణన్ పేర్కొన్నారు.
News Posted: 13 November, 2009
|