గొత్తికోయలను ఆపండి హైదరాబాద్ : చత్తీస్ గఢ్ నుంచి చొచ్చుకు వస్తున్న గొత్తికోయల గిరిజనుల వలన రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పెరుగుతుందని భావిస్తున్న పోలీసులు వారిని వెనక్కి పంపించేయాలని కేంద్రంపై వత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి మరో లేఖ రాశారు. గొత్తికోయలను వెనుకకు పంపించేందుకు కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కేంద్రం మాత్రం ఇంతవరకు దీనిపై సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఒకవైపు రాష్ట్రం నుండి కేంద్రానికి లేఖలు, నివేదికలు వెళ్తున్నప్పటికీ మరోవైపు గొత్తికోయల వలసలు రాష్ట్రంలోకి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అరవై వేల మంది వరకు గొత్తికోయలు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లోకి వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఛత్తీస్ గఢ్ లో గొత్తికోయలు మావోయిస్టులకు అనుకూలురుగా ముద్రపడ్డ సంగతి తెలిసిందే. అక్కడి పోలీసులకు సహకరించే సల్వాజుడుంతో గొత్తికోయలకు ఉన్న జాతి వైరం వల్ల ఆ ప్రాంతంలో తరచూ యుద్ధాలు జరుగుతున్నాయి. సల్వాజుడం ధాటికి తట్టుకోలేక అనేకమంది గొత్తికోయలు ఆంధ్రాలోకి వలస రావడం ప్రారంభించారు. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల నుండి వలసలు ఉంటున్నప్పటికీ గత నాలుగైదు ఏళ్ళుగా ఇవి మరింత ఉధృతమయ్యాయి. వీరిలో మావోయిస్టు సానుభూతి పరులు కూడా ఉన్నారని పోలీసుల అనుమానం. అందుకనే వారిని వెనక్కి పంపియాలని కోరుతున్నారు. ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళే వారిని నిరోధించడం రాజ్యాంగపరంగా సాధ్యం కాదని అప్పట్లో కేంద్రం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో మరోసారి పునరాలోచించి గొత్తికోయలను నిరోధించాలంటూ పోలీసులు లేఖ రాసినట్లు సమాచారం.
కాగా, గొత్తికోయల వలసలను అడ్డుకోవాలని పోలీసులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు మావోయిస్టుల రాక కూడా రాష్ట్రంలోకి ఎక్కువైపోయింది. ఆపరేషన్ అబూజ్ మాడ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు రాష్ట్రంలోకి అడుగుపెట్టినట్లు ఒక పోలీసు అధికారి స్వయంగా అంగీకరించడం గమనార్హం. గత ఆగస్టు నుండి ముందు జాగ్రత్తగా అనేకమంది మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించారు. దాదాపు నాలుగు బృందాలు రాష్ట్రంలోకి వచ్చినట్లు సమాచారం. మొత్తం 60 నుండి 70 మంది వరకు ఇలా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు భోగట్టా.
కాగా, ఇప్పుడు వచ్చిన వారితో కలిసి రాష్ట్రంలో 150 నుండి రెండు వందల మంది మావోయిస్టు కార్యకర్తలు ఉన్నట్లు పోలీసుల అంచనా. రాష్ట్రంలో మావోయిస్టులకు గుండెకాయ లాంటి నల్లమలలో మల్ళీ మావోయిస్టుల కదలికలు ప్రారంభమైనట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు మళ్ళీ అడవి బాట పట్టారు. పోలీసులు నల్లమలలో అడపాదడపా గాలింపు చర్యలు చేపడుతూ సందర్భాన్ని బట్టి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
News Posted: 13 November, 2009
|