ప్రిలిమ్స్ స్థానంలో 'అభిరుచి' న్యూఢిల్లీ : సివిల్ సర్వీస్ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ఇప్పుడున్న సివిల్ సర్వీస్ ప్రిలిమనరీ పరీక్ష స్థానంలో అభిరుచి పరీక్ష (ఆప్టిట్యూడ్ టెస్టు)ను ప్రవేశపెట్టాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యుపిఎస్ సి) సూచించింది. అభ్యర్థులదంరికీ రెండు అబ్జెక్టివ్ టైప్ పేపర్లు ఉండాలనేది ప్రతిపాదన. 'కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన సివిల్ సర్వీసులలో వారి అభిరుచులను, నిర్ణయాలు తీసుకోవడంలో నైతిక కోణాలను పరీక్షించడం ఈ ప్రతిపాదన లక్ష్యం' అని పరిపాలన ప్రజాసేవపై యుపిఎస్ సి లెక్చరర్ సిరీస్ లో మాట్లాడుతూ యుపిఎస్ సి ఛైర్మన్ డిపి అగర్వాల్ అన్నారు. అభ్యర్థులందరూ ఈ ఉమ్మడి పరీక్షలు రాయాల్సి ఉంటుంది కనుక ప్రతిపాదిత మార్పుల వల్ల అందరికీ సమానావకాశం లభిస్తుందని ఆయన అన్నారు. అయితే వివిధ అంశాలను పరిశీలించడానికి నిపుణుల కమిటీని నియమించే వరకు మెయిన్స్ పరీక్షా విధానాన్ని మార్చకుండా అలాగే ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సివిల్ సర్వీస్ పరీక్ష రాయడానికి ఇస్తున్న అవకాశాల సంఖ్యను తగ్గించాలన్న రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ చేసిన సిఫార్సులను ఆయన సమర్థిస్తూ, అయితే సివిల్ సర్వీసు పరీక్షలు రాయడానికి అర్హత వయసును తగ్గించడం వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ప్రయోజనాలు దెబ్బతినవచ్చని, ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లోని వారికంటే ఆలస్యంగా వారు తమ గ్రాడ్యేషన్ ను పూర్తి చేస్తారని అన్నారు. అలాగే సివిల్ సర్వీసు పరీక్ష ద్వారా ఎంపిక చేసిన అధికారుల పని తీరును ప్రారంభ సంవత్సరాల్లో గమనిస్తూ ఉండడం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. వారి పని తీరుపై నివేదికలను కమిషన్ కు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని, దీనివల్ల భవిష్యత్తులో ఎంపిక ప్రక్రియలో వీటిని పరిగణనలోకి తీసుకోవడానికి వీలవుతుందని అగర్వాల్ అన్నారు.
News Posted: 13 November, 2009
|