రేటింగ్ సంస్థలూ తస్మాత్! న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత విద్యా సంస్థల గుర్తింపు కోసం కొత్తగా ప్రవేశపెట్టనున్న వ్యవస్థ విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు మరీ అతిగా లేదా మరీ తక్కువగా స్థాయి (రేట్)ని సూచించే రేటింగ్ సంస్థలకు లేదా అధికారులకు మొట్టమొదటిసారిగా జరిమానాలను, జైలు శిక్షలను విధించనున్నది. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణ వచ్చినట్లయితే రేటింగ్ సంస్థలను అనర్హమైనవిగా ప్రకటించడానికే కాకుండా సివిల్ లేదా క్రిమినల్ కేసులు వేయడానికి రెగ్యులేటరీ అధికారులకు అధికారాలు దత్తం చేయడానికి కూడా ఈ గుర్తింపు వ్యవస్థ ఏర్పాటు కోసం ఉద్దేశించిన చట్టం కొత్త నిఘా సంస్థకు వీలు కల్పిస్తుంది.
విద్యా సంస్థల గుర్తింపులో అవినీతి చర్యల వల్ల నష్టానికి గురైన సంస్థలు లేదా సాధారణ పౌరులు సంబంధిత అధికారులపై సివిల్ కేసులు దాఖలు చేయడానికి కూడా ఈ ప్రతిపాదిత చట్టం వీలు కల్పిస్తుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలియజేశారు. నిందితులపై ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి పౌరులు లేదా సంస్థలు రెగ్యులేటరీ సంస్థ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. జాతీయ గుర్తింపు, మదింపు మండలి (నాక్), జాతీయ గుర్తింపు బోర్డు (ఎన్ బిఎ) వంటి ప్రభుత్వ రేటింగ్ సంస్థలు, ఇప్పుడు ఉన్నత విద్యా సంస్థల రేటింగ్ కు అనుమతి పొందనున్న ప్రైవేట్ సంస్థలు ఈ క్లాజుల పరిధిలోకి వస్తాయి. ఒక రేటింగ్ సంస్థ తరఫున ఒక సంస్థ క్లెయిములను పరిశీలించే విద్యావేత్తలు కూడా శిక్షార్హులు అవుతారని మంత్రిత్వశాఖ వర్గాలు సూచించాయి.
'ఉన్నత విద్యా సంస్థ గుర్తింపులో నియంత్రణకు సంబంధించిన జాతీయ ప్రాధికార సంస్థ (ఎన్ఎఆర్ఎహెచ్ఇఐ) బిల్లు'గా పేర్కొనే ఈ ప్రతిపాదిత చట్టం ప్రస్తుతం న్యాయ మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉందని మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) మంత్రిత్వశాఖ వర్గాలు తెలియజేశాయి. ఫ్యాకల్టీ సంఖ్య, మౌలిక వసతులు, అడ్మిషన్, మదింపు ప్రక్రియలలో పారదర్శకత వంటి ప్రమాణాల ప్రాతిపదికతో రేటింగ్ ను నిర్ణయిస్తారు. సంస్థ రేటింగ్ కు, ప్రమాణాలకు మధ్య వ్యత్యాసాలను కనుగొనడం ద్వారా అక్రమాలు జరిగినట్లు నిర్థారిస్తారు.
News Posted: 14 November, 2009
|